Portfolio Allocation | తెలంగాణ కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. సీఎల్పీ నేతగా ఎన్నికైన రేవంత్‌రెడ్డితో ఇవాళ ఎల్బీ స్టేడియంలో గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ప్రమాణస్వీకారం చేయించారు. ఈ సభకు కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ సైతం హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎంతో పాటు 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రులుగా ప్రమాణం చేసిన నేతలకు ముఖ్యమంత్రి శాఖలను కేటాయించినట్లుగా వార్తలు వచ్చాయి. ఇందులో భట్టి విక్రమార్క రెవెన్యూశాఖ, ఉత్తమ్ కుమార్ రెడ్డికి హోంశాఖ, దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు ఆర్థిక శాఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి నీటి పారుదల శాఖ, దామోదర రాజనర్సింహకు ఆరోగ్యశాఖ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి మున్సిపల్ శాఖను కేటాయించినట్లు ప్రచారం జరిగింది.
అలాగే, పొన్నం ప్రభాకర్‌కు బీసీ సంక్షేమం, కొండా సురేఖకు మహిళా-శిశు సంక్షేమం, ధనసరి అనసూయ (సీతక్క)కు గిరిజన సంక్షేమం, తుమ్మల నాగేశ్వర్ రావుకు రోడ్లు-భవనాలు, జూపల్లి కృష్ణారావు – పౌర సరఫరాల శాఖను కేటాయించినట్లు వార్తలు వచ్చాయి. అయితే, ఇందులో ఏమాత్రం వాస్తవం లేదని సమాచారం. ఇప్పటి వరకు మంత్రులకు ఎలాంటి శాఖలు కేటాయించలేదని తెలిసింది. త్వరలోనే సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్తారని.. ఆ తర్వాతే శాఖల కేటాయింపుపై స్పష్టత రానున్నట్లు తెలుస్తున్నది. ఇప్పటికే ముఖ్యమంత్రి పదవితో పాటు కేబినెట్ పోర్ట్‌ఫోలియోల విషయంలో నేతలు పట్టుబట్టిన విషయం విధితమే. చివరకు అధిష్ఠానం ఎమ్మెల్యేల అభిప్రాయం మేరకు సీఎంపై నిర్ణయం తీసుకున్నది. ఉప ముఖ్యమంత్రి పదవులు ఇద్దరికి ఇవ్వాలని సీఎం నిర్ణయించారని.. ఓ సీనియర్ నేత ఇస్తే ఒకరికే డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని అధిష్ఠానికి స్పష్టం చేశారు.
ఇద్దరు సీనియర్ నేతలు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్‌రెడ్డి సీఎం పదవిని ఆశించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రేవంత్ వైపే అధిష్ఠానం, మెజారిటీ ఎమ్మెల్యేలు మొగ్గు చూపిన నేపథ్యంలో సీనియర్లు ఇద్దరికీ మంత్రివర్గంలో కీలక పదవులు ఇవ్వనున్నట్లుగా తెలుస్తున్నది. ప్రస్తుతం భట్టికి ఉప ముఖ్యమంత్రితో పాటు రెవెన్యూశాఖను, ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి హోంశాఖను కేటాయించినట్లు ప్రచారం జరిగింది. ప్రస్తుతం కేబినెట్లోకి 11 మందిని తీసుకోగా.. మరికొందరికి ఛాన్స్ ఉన్నది. మిగిలిన కేబినెట్ బెర్తుల కోసం కొత్తగా ఎన్నికైన నేతలతో పాటు పలువురు సీనియర్లు సైతం ఆశిస్తున్నారు. మిగతా మంత్రివర్గంతో పాటు శాఖలపై కేటాయింపుపై అధిష్ఠానంతో చర్చించి ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.