మద్దూరు (ధూళిమిట్ట ) : తెలంగాణ రాష్ట్ర గీత రచయిత, ప్రజా కవి, గాయకుడు డాక్టర్ అందెశ్రీ(Andesri) గుండెపోటుతో సికింద్రాబాద్ గాంధీ దవాఖానాలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. అందెశ్రీ((64)) మృతితో ఆయన స్వగ్రామమైన సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం రేబర్తి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రేబర్తి గ్రామానికి చెందిన అందే బొడ్డయ్య, ఎల్లమ్మ దంపతులకు ముగ్గురు సంతానం ఇద్దరు కుమారులు, ఒక కూతురు, వీరిలో ఒకరు అందె ఎల్లయ్య( అందెశ్రీ) చిన్ననాటి నుండి ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు. తన తండ్రి బుడ్డయ్య గ్రామానికి చెందిన జక్కిరెడ్డి మల్లారెడ్డికి పశువుల కాపరిగా జీతం ఉంచాడు.
కూలీ నుంచి గేయ రచయి వరకు..
అక్కడ నుండి అదే గ్రామానికి చెందిన ఎండీ మునీర్ వద్ద కూడా అందెశ్రీ పశువుల కాపరిగా జీతం ఉన్నాడు. జీతం చేస్తూనే మేస్త్రి పని నేర్చుకొని నిజామాబాద్ జిల్లాకు వలస కూలిగా వెళ్లి అక్కడ పనిచేశాడు. 1980 సంవత్సరంలో తిరిగి రేబర్తి గ్రామానికి వచ్చి అక్కడనుండి చేర్యాల ప్రాంతానికి మేస్త్రి పని చేశాడు. నాడు వరంగల్ జిల్లా(Warangal) అదనపు కలెక్టర్ చేర్యాలలో పాటలు, సాహిత్య పోటీలు నిర్వహించడంతో ఆ పోటీలలో మొట్టమొదటగా పాల్గొని మొదటి బహుమతి పొందాడు. 1987లో రేబర్తి సొసైటీ డైరెక్టర్గా గెలుపొందాడు. చేర్యాల మండలం బండపల్లి గ్రామానికి చెందిన మల్లవ్వ తో వివాహం జరిగింది. వీరికి నలుగురు సంతానం.
సమాజాన్ని మేలుకొల్పేలా
ముగ్గురు కుమార్తెలు. ఒక కుమారుడు ఉన్నాడు. అప్పటి నుండి పాటలు రాస్తూ హైదరాబాద్కు కుటుంబంతో తరలి వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. కాగా, శృంగేరి మఠానికి సంబంధించిన స్వామీ శంకర్ మహారాజ్ ఇతను పాడుతుండగా విని ఇతడిని చేరదీసాడు. నాటి నుంచి నేటి వరకు ఆయన కలం నుంచి సమాజాన్ని మేలుకొల్పే ఎన్నో గేయాలు వెలువడ్డాయి. తెలంగాణ ఉద్యమంలో అందెశ్రీ పాటలు ఉద్యమాన్ని ఉర్రూలూగించాయి. సినీ నటుడు నారాయణ మూర్తి ద్వారా వచ్చిన విప్లవాత్మక సినిమాల విజయం వెనుక ఈ పాటలున్నాయి. తెలంగాణ, ప్రకృతి లాంటి అంశాలపై గేయరచన చేసారు. అందెశ్రీ మృతితో రేబర్తిలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఊరితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకొని స్థానికులు కంటతడి పెట్టుకున్నారు.

రేబర్తిలోని అందెశ్రీ ఇంటి వద్ద గ్రామస్తులు

స్థానిక పాఠశాలలలో నివాళులు అందెశ్రీ మృతికి మౌనం పాటిస్తున్న విద్యార్థులు