పట్టించుకోని హుజూర్నగర్ ప్రజలు
వచ్చిందే అంతంత మాత్రం.. మధ్యలోనే వెనుదిరిగిన జనం
ఈటల సభా ప్రాంగణంలో దర్శనమిచ్చిన ఖాళీ కుర్చీలు
హుజూర్నగర్ , జూన్ 13: కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి ఎనిమిదేండ్లు పూర్తయిన సందర్భంగా సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బొబ్బ భాగ్యారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన బహిరంగ సభకు ప్రజల నుంచి స్పందన కరువైంది. సభకు ముఖ్య అతిథిగా హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ హాజరైనా జనం పట్టించుకోలేదు.
వచ్చిన కొంత మంది కూడా ఈటల మాట్లాతుండగా మధ్యలోనే వెళ్లిపోయారు. దీంతో సభా ప్రాంగణంలో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. బహిరంగ సభకు ఆది నుంచే జన సమీకరణ కోసం తిప్పలు పడిన బీజేపీ నాయకులు.. ఈటల సభకు ఆలస్యంగా రావడంతో వచ్చిన ప్రజలు జారుకునే ప్రయత్నం చేశారు. వారు వెళ్లకుండా బీజేపీ నాయకులు కాపలా కాస్తూ సభ ప్రాంగణం వద్ద నానా తంటాలు పడ్డారు. దీంతోపాటు బీజేపీ రాష్ట్ర నాయకుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి సభకు దూరం కావడంతో ఆ పార్టీలో వర్గ పోరు తేటతెల్లమైంది. మొత్తం మీద బీజేపీ సభను హుజూర్నగర్ ప్రజలు పెద్దగా పట్టించుకోలేదని చెప్పవచ్చు.