ధర్మపురి, జూన్13 : చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఓ అభాగ్యుడిని కిరాయి ఇంట్లోకి యజమాని రానివ్వకపోవడంతో బతికుండగానే అతడిని కుటుంబసభ్యులు శ్మశానానికి తరలించిన హృదయ విధారక ఘటన జగిత్యాల జిల్లా ధర్మపురిలో స్థానికులను కలచివేసింది. పెద్దపెల్లి జిల్లా జూలపల్లి మండలం కుమ్మరికుంటకు చెందిన రంగు గోపి (45) చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయి పొట్టచేతపట్టుకొని ధర్మపురికి వచ్చాడు. 20 ఏండ్లుగా ఓ ఇంట్లో అద్దెకు ఉండి ధర్మపురిలోనే టిఫిన్ బండి నడుపుకొంటూ బతుకు నెట్టుకొచ్చాడు. ఇడ్లీ బండితో వచ్చిన ఆదాయంతోనే ఇద్దరు చెల్లెళ్ల పెండ్లి చేశాడు. కొద్ది నెలలుగా గోపి తీవ్ర అనారోగ్యంతో మంచానికే పరిమితమయ్యాడు.
చికిత్సకోసం అతడి చెల్లెళ్లు కరీంనగర్లోని ఓ దవాఖానలో చేర్పించారు. రెండు రోజులుగా అతడి శరీరం చికిత్సకు సహకరించడం లేదని, ఇంటికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించడంతో ఓ ప్రైవేటు వాహనంలో శుక్రవారం ధర్మపురికి తీసుకొచ్చారు. గోపిని ఇంట్లోకి తీసుకురావద్దని ఇంటి యజమాని తెగేసి చెప్పడంతో చేసేదేం లేక అక్కడి నుంచి నేరుగా శ్మశానవాటికకు తరలించారు. అక్కడే కర్మకాండల షెడ్డులో పడుకోబెట్టి కన్నీరుమున్నీరవుతున్నారు. బతికుండగానే గోపిని శ్మశానానికి తీసుకెళ్లడం స్థానికుల హృదయాలను ద్రవింపజేసింది.