హుజూరాబాద్టౌన్, మార్చి 11: ‘దళితబంధు గొప్ప పథకం. దేశంలో ఇలాంటి స్కీం ఎక్కడా లేదు. . ఎంచుకున్న వ్యాపారాల్లో కష్టపడి రాణించాలి’ అని దళిత్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (డిక్కీ) జాతీయ అధ్యక్షుడు నర్రా రవికుమార్ పిలుపునిచ్చారు. దళితబంధు పథకం అమలు తీరును పరిశీలించేందుకు ఐదుగురు సభ్యులతో కూడిన డికీ బృందం.. దళితబంధును పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్న హుజూరాబాద్ నియోజకవర్గంలో శనివారం పర్యటించింది. శాలపల్లి, చల్లూరు, జమ్మికుంటలోని యూనిట్లను సందర్శించి పథకం అమలు తీరును పరిశీలించింది. లబ్ధిదారులతో మాట్లాడి వ్యాపారాభివృద్ధిని తెలుసుకున్నది.
అనంతరం సింగాపురం కిట్స్ కళాశాలలో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి బృందం సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ.. దళితులను గొప్ప వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు పథకం తీసుకొచ్చి.. ఏకంగా రూ.10 లక్షలు అందజేయడం గొప్ప విషయమని కొనియాడారు.
లబ్ధిదారులు కష్టపడి సీఎం కేసీఆర్ ఆకాంక్షలను నిజం చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, డికీ ప్రతినిధులు కే రవికుమార్, పరమేశ్, రమేశ్, డీ నారాయణ, ఎస్సీ కార్పొరేషన్ అధికారులు సురేశ్, నాగార్జున, ప్రత్యేకాధికారి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.