ఖైరతాబాద్, అక్టోబర్ 3: ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ప్రభుత్వం చేసిన తప్పులను ప్రశ్నిస్తే సోషల్‌మీడియా యాక్టివిస్టులను జైలులో పెడుతున్నారని వైసీపీ ప్రధాన కార్యదర్శి, మాజీ అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి విమర్శించారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రం పరిధిలోని ఐటీ చట్టాన్ని మార్చేందుకు ఏపీ సీఎం చంద్రబాబు మంత్రులతో కమిటీ వేయడం హస్యాస్పదమని తెలిపారు.
సోషల్ యాక్టివిస్టుల గొంతు నొక్కేందుకు ఐటీ చట్టంలో సవరణలు చేయాలని ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. 15 నెలల కాలంలో 2వేల మంది యాక్టివిస్టులను అరెస్టు చేశారని తెలిపారు. ఇప్పటికే మీడియా కేసులలో బీఎన్ఎస్ సెక్షన్ 111ను విధించడంపై హైకోర్టు చంద్రబాబుకు మొట్టికాయలు వేసిందని చెప్పారు. ఏపీలో చంద్రబాబు నియంత పాలన సాగుతున్నదని విమర్శలు గుప్పించారు. వైసీపీపై కూటమి పార్టీలోని నేతలు విషప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. కేసులతో గొంతు నొక్కలేరని, న్యాయపోరాటం చేస్తామని చెప్పారు.