హైదరాబాద్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ) : ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో శుక్రవారం బీసీ సెల్‌ను రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించనున్నట్టు వర్సిటీ ఉప కులపతి ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య తెలిపారు. రాజేంద్రనగర్‌లోని పరిపాలన భవనంలో నూతనంగా ఏర్పాటుచేసిన బీసీ సెల్ కార్యాలయాన్ని మంత్రి ప్రారంభిస్తారని చెప్పారు.
ఇటీవల జరిగిన వర్సిటీ పాలక మండలి సమావేశంలో ఎస్సీ, ఎస్టీ సెల్ తరహాలో యూజీసీ మార్గదర్శకాలను అనుసరించి బీసీ సెల్ ఏర్పాటుకు పాలకమండలి ఏకగ్రీవంగా ఆమోదించిందని తెలిపారు. యూనివర్సిటీలో పనిచేస్తున్న బోధన, బోధనేతర బీసీ ఉద్యోగులు, విద్యార్థుల సంక్షేమం కోసం ఈ సెల్ పనిచేయనున్నట్టు చెప్పారు. విద్య, ఉద్యోగాల్లో బీసీల వాటాను సక్రమంగా పాటించేలా చూడటం, వాటా ప్రకారం ఉద్యోగులకు పదోన్నతులు కల్పించడం, ప్రవేశాల్లో బీసీ రిజర్వేషన్లు అమలయ్యేలా ఈ విభాగం పర్యవేక్షించనున్నట్టు వెల్లడించారు.