హైదరాబాద్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ): ప్రజా సమస్యలపై చర్చించేందుకు గత ప్రభుత్వాలు ప్రతిపక్షాలకు తగినంత సమయం, అవకాశం కల్పించేవని, ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతిపక్షం ప్రశ్నించే పరిస్థితి లేకుండా పోయిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య పేర్కొన్నారు. వాస్తవాలను దాచకుండా పారదర్శకంగా వ్యవహరించడం, ప్రజలకు నిజాలు తెలియజేయడం ప్రభుత్వాల బాధ్యత అని తెలిపారు. గతంలో ప్రభుత్వాలు ప్రతిపక్షాల అభిప్రాయాలకు, ప్రజా సమస్యలపై చర్చలకు ప్రాధాన్యం ఇచ్చాయని గుర్తుచేశారు.
2006లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇరిగేషన్ సమస్యలపై చర్చించేందుకు ప్రతిపక్ష టీడీపీకి 18 రోజులపాటు అవకాశం ఇచ్చిందని గుర్తుచేశారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో ప్రతిపక్షం అడిగిన ప్రశ్నలకు సుదీర్ఘంగా సమాధానాలు ఇచ్చానని చెప్పారు. ఒకే ప్రశ్నపై సుమారు 3:45 గంటలపాటు సమాధానం ఇచ్చిన సందర్భం ఉన్నదని తెలిపారు. ఇప్పుడు ప్రశ్నిస్తే సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేసే పరిస్థితి ఎందుకు వస్తున్నదో ప్రభుత్వం పరిశీలించుకోవాలని సూచించారు. ‘ప్రతిపక్షం అడగొద్దు.. అధికార పక్షం చెప్పొద్దు’ అన్నట్టు ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ తీరు ఉన్నదని వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యలపై చర్చించకుండా కాలం గడపడం మంచిదికాదని హితవు పలికారు.