మానకొండూర్, జనవరి 17: అవగాహన లేమి, అహంకార ధోరణితో రేవంత్ సర్కార్ నడుస్తున్నదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా ఆరు గ్యారెంటీలను అమలు చేయడం లేదని మండిపడ్డారు. తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తానని సీఎం రేవంత్‌రెడ్డి ప్రయత్నించడం అతని మూర్ఖత్వానికి నిదర్శనమని అన్నారు. కేసీఆర్ అంటే ప్రజలకు అపార విశ్వాసం ఉన్నదని అన్నారు.
కరీంనగర్ జిల్లా మానకొండూర్‌లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ మోసపూరిత వాగ్దానాలు, హామీలతో గద్దెనెక్కిందని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అమలైన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తుందా లేదా? అని చెప్పే ధైర్యం సీఎం రేవంత్‌రెడ్డికి ఉన్నదా? అని ప్రశ్నించారు. ఆరు గ్యారెంటీలు, హామీలు అమలు చేయడానికి ఎన్ని డబ్బులు అవసరమవుతాయో అసలు రేవంత్‌కు తెలుసా? అని అడిగారు.
ఇచ్చిన హామీలనే ఇప్పటివరకు అమలు చేయలేదని, అదనంగా మూసీ సుందరీకరణ పనులకోసం రూ.లక్షా 50 వేల కోట్లు, రాష్ట్రంలో 24 లక్షల ఇండ్లు, ఆరేండ్లలో 20 వేల మెగావాట్ల గ్రీన్ పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం చేపడుతామని ప్రకటించారని, వీటికి నిధులెలా తెస్తారని ప్రశ్నించారు? సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణారావు, కేడీసీసీబీ చైర్మన్ కొండూ రు రవీందర్రావు, కరీంనగర్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ పాల్గొన్నారు.