హైదరాబాద్, ఫిబ్రవరి 14 (నమస్తేతెలంగాణ): తెలంగాణ అభివృద్ధిని చూసి ఓర్వలేకే కేంద్రం దుష్ప్రచారం చేస్తున్నదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత పొన్నాల లక్ష్మయ్య మండిపడ్డారు. తెలంగాణను అప్పులకుప్పలా మార్చారని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. శుక్రవారం తెలంగాణభవన్‌లో బీఆర్ఎస్ నేత నరేందర్‌గౌడ్‌తో కలిసి విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఎనిమిదిసార్లు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలాసీతారామన్‌కు అప్పులు కూడా ఆర్థికవ్యవస్థలో భాగమనే విషయం తెలియకపోవడం విడ్డూరమని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం దేశ ఆదాయంలో 85 శాతం అప్పులు చేసిన విషయాన్ని మర్చిపోయిన ఆమె రాష్ట్ర ఆదాయంలో కేవలం 26 శాతం అప్పులున్న తెలంగాణపై అక్కసు వెళ్లగక్కడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. దేశంలో 12 ప్రధాన రాష్ట్రాల కన్నా తెలంగాణ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉన్న విషయం గుర్తుంచుకోవాలని హితవు పలికారు.