జగిత్యాల, మే 16 : జగిత్యాలలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి చేదుఅనుభవం ఎదురైంది. శుక్రవారం జిల్లా కేంద్రానికి వచ్చిన మంత్రి.. ఆలింగనం చేసుకునేందుకు మాజీ మంత్రి జీవన్‌రెడ్డి వద్దకు వెళ్లగా ఆయన వెనక్కి జరిగి నమస్కారం అంటూ పక్కకు జరిగారు. ‘ఇక మా పని అయిపోయింది.. మీ రాజ్యం మీరు ఏలండి’ అంటూ జీవన్‌రెడ్డి మంత్రి, ప్రభుత్వ విప్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అంతకుముందు జీవన్‌రెడ్డి.. కలెక్టరేట్లో మంత్రికి మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.
ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలో ఇసుక స్టాక్ సెంటర్ ఏర్పాటు చేయాలని వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ ఇసుక పాయింట్ లేకపోవడంతో అక్రమ రవాణా ఎక్కువైందని తెలిపారు. అనంతరం మంత్రి పొంగులేటి మాట్లాడుతూ తప్పని సరిగా ఇసుక పాయింట్ ఏర్పాటు చేస్తానని చెప్పి జీవన్‌రెడ్డిని ఆలింగనం చేసుకునేందుకు ప్రయత్నించగా ఆయన వెనక్కి జరిగి నమస్కారం అంటూ మంత్రితో మాట్లాడారు. వారి వెంట ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఉన్నారు.