హైదరాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ) :రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన ఫిర్యాదులను ఆగస్టు 15లోగా పరిష్కరించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రెవెన్యూ సదస్సుల్లో 8.65 లక్షల దరఖాస్తులు వచ్చాయని, ఇందులో సాదాబైనామా, సర్వే నంబర్ మిస్సింగ్, అసైన్డ్ ల్యాండ్ క్రమబద్ధీకరణ, సక్సెషన్‌కు సంబంధించి 6 లక్షల దరఖాస్తులు ఉన్నట్టు తెలిపారు. ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని, తిరస్కరణకు కారణాన్ని వెల్లడించాలని సూచించారు.
ఇక జిల్లాల్లో అసైన్డ్ ల్యాండ్ లబ్ధిదారుల వివరాల నివేదికను ఈ నెల 30లోగా ప్రభుత్వానికి పంపించాలని ఆదేశించారు. అంతకుముందు పౌరసంబంధాల శాఖపై సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత సమాచార, పౌరసంబంధాల శాఖ అధికారులపై ఉన్నదని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. మంగళవారం సచివాలయంలో మంత్రి పొంగులేటి సమాచార, పౌరసంబంధాల శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.