వరంగల్, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : విద్యార్థులేమైనా టెర్రరిస్టులా? సంఘ విద్రోహ శక్తులా? అని బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్‌రావు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. పాలిటెక్నిక్ విద్యార్థుల గొంతు పిసుకుతరా? అని నిప్పులు చెరిగారు. తమ భవిష్యత్‌ను బుగ్గిపాలు చేయకూడదని విద్యార్థులు ఆందోళన చేస్తుంటే రాహుల్‌గాంధీ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఢిల్లీకో నీతి.. తెలంగాణ విద్యార్థులకు ఓ నీతా? అని నిప్పులు చెరిగారు. రేవంత్‌రెడ్డి స్కిల్ యూనివర్సిటీ పేరుతో లక్ష మంది పాలిటెక్నిక్ విద్యార్థులతో చెలగాటం ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
తమను అరెస్టు చేస్తే విద్యార్థుల సమస్యలు తీరిపోతాయా? అని ప్రశ్నించారు. గురువారం వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ విద్యార్థుల ధర్నాకు సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్న క్రమంలో పోలీసులు తనను అరెస్ట్ చేయడాన్ని హరీశ్‌రావు ఖండించారు. హనుమకొండ జిల్లా సుబేదారి పోలీస్ స్టేషన్ వద్ద మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, టీ రాజయ్య, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయభాస్కర్, వొడితెల సతీశ్‌కుమార్, చల్లా ధర్మారెడ్డి, మాజీ ఎంపీ మాలోత్ కవిత, పార్టీ సీనియర్ నాయకులు నాగుర్ల వెంకటేశ్వర్రావు, వాసుదేవరెడ్డి, సాంబారి సమ్మారావు, మర్రి యాదవరెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్, గోసుల శ్రీనివాస యాదవ్, రాకేశ్‌రెడ్డి, దాస్యం విజయభాస్కర్, జోరిక రమేశ్‌తో కలిసి హరీశ్ మీడియాతో మాట్లాడారు. పాలిటెక్నిక్‌ను సిల్ యూనివర్సిటీలో కలుపొద్దని పోరాటం చేస్తుంటే విద్యాశాఖ మంత్రిగా ఉన్న రేవంత్‌రెడ్డి వారి భవిష్యత్‌తో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు.
పాలిటెక్నిక్‌ను స్కిల్ వర్సిటీలో కలుపాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎవరైనా దరఖాస్తు ఇచ్చారా? అని హరీశ్‌రావు ప్రశ్నించారు. సిల్ యూనివర్సిటీ అనేది పీపీపీ మోడల్‌తో ఏర్పాటు చేశారని, ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలను అందులో కలుపడం అంటే ప్రైవేట్‌పరం చేయడమేనని పేర్కొన్నారు. స్కిల్ వర్సిటీలో కలిపి ప్రైవేట్‌పరం చేసి అడ్డగోలుగా ఫీజులు పెంచితే పేద పిల్లల భవిష్యత్ ఏం కావాలి? అని నిలదీశారు. ఏఐసీటీఈ అనుమతితో చదువుతున్నందువల్లే పాలిటెక్నిక్ విద్యార్థులకు నేరుగా ఇంజినీరింగ్ సెకండ్ ఇయర్ (లాటరల్ ఏంట్రీ)లో సీటు వస్తుందని, సిల్ యూనివర్సిటీలో కలిపితే ఆ అవకాశాన్ని కోల్పోతారని ఆందోళన వ్యక్తంచేశారు. పిల్లల భవిష్యత్ దెబ్బతింటుందని ఏపీ ప్రభుత్వం వెనకి తగ్గిందని చెప్పారు. ఢిల్లీ, ఏపీల్లో ఫెయిల్ అయిన విధానాన్ని తెలంగాణలో ఎందుకు రుద్దుతున్నారో అర్థం కావడం లేదని అన్నారు. భేషజాలకు పోకుండా జీవో 97 రద్దు చేయాలని డిమాండ్ చేశారు.