వరంగల్, జూన్ 25: వరంగల్‌లోని వెటర్నరీ పాలిటెక్నిక్ కాలేజీలో ఈ విద్యా సంవత్సరం సీట్ల భర్తీకి సర్కారు మంగళం పాడింది. పీవీ నర్సింహారావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం పరిధిలో మహబూబ్‌నగర్, కరీంనగర్, సిద్దిపేట, మామునూర్ కాలేజీల్లో వెటర్నరీ డిప్లొమా కోర్సు ఉన్నది. మామునూరు వెటర్నరీ పాలిటెక్నిక్ మినహా మిగిలిన మూడు కాలేజీల్లో 30 చొప్పున సీట్లు ఉన్నాయి.
మామునూరులో మాత్రం 20 సీట్లు ఉన్నాయి. మిగతా ఏ పాలిటెక్నిక్ కాలేజీలో లేని వసతులు, సౌకర్యాలే కాకుండా పరిశోధన (రిసెర్చ్) కేంద్రం ఉన్నది. మొత్తం 237 ఎకరాల్లో విస్తరించిన వెటర్నరీ కాంప్లెక్స్‌లో పాలిటెక్నిక్ కాలేజీకి 15.5 ఎకరాల స్థలం, శాశ్వత భవనాలు (హాస్టల్ వసతి సహా) ఉన్నాయి. పౌల్ట్రీఫామ్స్, డెయిరీ, షీప్, హాచరీ ఫామ్స్ ఉన్నాయి. కానీ ఈ సంవత్సరం మామునూరులో సర్కారు అడ్మిషన్లను నిరాకరించడం వెనుక ఆంతర్యం ఏమిటో అంతుబట్టడం లేదని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.
మామునూరు విమానాశ్రయాన్ని ఆనుకొని ఉన్న వందల ఎకరాల ప్రభుత్వ భూ ములను ప్రైవేట్‌కు ధారాదత్తం చేయాలని ఉమ్మడి పాలకులు చేసిన కుట్రను నాడు బీఆర్ఎస్ పార్టీ ఎదుర్కొన్నది. ఫలితంగా 2013లో వెటర్నరీ పాలిటెక్నిక్ కాలేజీ ఏర్పాటైంది. అయితే, ఉన్నట్టుండి ఈ విద్యా సంవత్సరం సీట్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కాలేదు. దీంతో వెటర్నరీ కాలేజీని ఎత్తివేసే ఆలోచనలో ఉన్నట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.