హైదరాబాద్, జనవరి 31(నమస్తే తెలంగాణ) : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం అంతమ్మగూడెం, పరిసర ప్రాంతాల్లో కాలుష్యాన్ని వెదజల్లుతున్న రసాయనిక పరిశ్రమలను మూసివేయాలని స్థానికులు డిమాండ్ చేశారు. జయ, వినీత్, హజెలో, బృందావన్, రావుస్, కెమిక్ లైఫ్ సైన్స్ తదితర ల్యాబోరేటరీలు విపరీతమైన వాయు, జల, భూ కాలుష్యానికి పాల్పడుతున్నాయని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ)కి ఫిర్యాదు చేశారు. కెమిక్ పరిశ్రమకు జనవరి 27న పీసీబీ ఇచ్చిన క్లోజర్ ఆర్డర్లో స్పష్టత లేదనే కారణంతో.. శుక్రవారం చౌటుప్పల్ మండలానికి చెందిన గుమ్మి దామోదర్‌రెడ్డి నేతృత్వంలో రైతులు హైదరాబాద్‌లోని పీసీబీ కార్యాలయంలో బోర్డు సభ్యుడు శరత్‌చంద్రారెడ్డిని కలిసి ఈ మేరకు రసాయన పరిశ్రమలపై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తమకు పరిశ్రమలు ఇచ్చే పరిహారం ముఖ్యం కాదని, స్థానికుల ఆరోగ్య రీత్యా ఆ పరిశ్రమలను శాశ్వతంగా మూసివేయాలని డిమాండ్ చేశారు.
6 నెలల్లోనే 38 ట్యాంకర్లు..
ఆయా కంపెనీలు వ్యర్థ వాయువులను గాలిలోకి, రసాయన జలాలను ఖాళీ స్థలాలు, మూసీ పరీవాహక ప్రాంతంలో వదిలేస్తున్నాయని శరత్‌చంద్రారెడ్డికి వివరించారు. కెమిక్ లైఫ్‌సైన్స్ పరిశ్రమ కేవలం ఆరు నెలల్లోనే 38 ట్యాంకర్ల వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లో వదిలినట్టు తెలిపారు. 2024 డిసెంబర్లో టాస్క్‌ఫోర్స్ అధికారుల బృందం తనిఖీకి వస్తున్నదని తెలిసి శ్రీజయ ల్యాబోరేటరీస్ వ్యర్థ రసాయనాలను వాహనాల ద్వారా తరలించినట్టు ఫిర్యాదుచేశారు. కాలుష్యకారక పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలని అనేకసార్లు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తంచేశారు.