MLC Elections | హైదరాబాద్, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్(ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్) రెండు ఎమ్మెల్సీ స్థానాలకు, నల్లగొండ, వరంగల్, ఖమ్మం(ఉపాధ్యాయ) ఎమ్మెల్సీ స్థానానికి ఈ నెల 27న పోలింగ్ జరుగనున్నది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనున్నది. ఇప్పటికే ఆయా జిల్లాల పరిధిలో అధికారులు ఏర్పాట్లను పూర్తిచేశారు. కాగా, మంగళవారం సాయంత్రం ఎన్నికల ప్రచారం ముగిసింది. కరీంనగర్ రెండు ఎమ్మెల్సీ స్థానాల నుంచి మొత్తం 56 మంది అభ్యర్థులు పోటీలు ఉన్నారు. ఇందులో టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి 15 మంది, నల్లగొండ టీచర్ ఎమ్మెల్సీ స్థానం నుంచి 19 మంది మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
ప్రచారానికి తెర..
ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రం ముగిసింది. మొత్తంగా మూడు ఎమ్మెల్సీ ఎన్నికల పోరు ఉత్కంఠరేపుతున్నది. ఏ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు.. ఎవరి బలమెంత అన్న చర్చోపచర్చలు టీచర్లు, గ్రాడ్యుయేట్లలో జోరుగా సాగుతున్నాయి. మొదటి ప్రాధాన్యత ఓట్లతో ఎవరూ గెలిచే అవకాశాల్లేవన్న ప్రచారమున్నది. ఈ నేపథ్యంలో మొదటి ప్రాధాన్యత ఓటు ఒకరికి వేస్తే.. ఎవరికి రెండు, మూడు, నాలుగో ప్రాధ్యాత ఓట్లు వేయాలన్న చర్చోపచర్చలు నడుస్తున్నాయి. ఎవరు మొదటిస్థానంలో ఉంటారు.. ఎవరు ముందుగా ఎలిమినేట్ అవుతారు.. ఎలిమినేట్ అయిన వారి రెండో, మూడో ప్రాధాన్యత ఓట్లను ఎవరికి బదలాయించాల్సి వస్తుందన్న అంచనాలు, చర్చలు హాట్‌హాట్‌గా జరుగుతున్నాయి. పోలింగ్‌కు ఒక్కరోజు మాత్రమే సమయం ఉండటంతో ఓటర్లను ఆకట్టుకునేందుకు కొందరు అభ్యర్థులు ప్రలోభాలకు తెరలేపినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
నల్లగొండలో హేమాహేమీలు..
ఉమ్మడి నల్లగొండ, వరంగల్, ఖమ్మం టీచర్స్ నియోజకవర్గం నుంచి హేమాహేమీలు పోటీలో ఉన్నారు. పీఆర్టీయూటీఎస్ నుంచి పింగిలి శ్రీపాల్‌రెడ్డి పోటీచేస్తుండగా.. ఆయన ప్రధానంగా ఆరు హామీలిస్తూ ప్రచారం చేశారు. సీపీఎస్ రద్దు, 2003 డీఎస్సీ టీచర్లకు పాత పింఛన్, మూడు నెలలకోసారి టీచర్లకు పదోన్నతులు, ఏకీకృత సర్వీస్‌రూల్స్, నూతన హెల్త్‌కార్డులు, కాంట్రాక్ట్ టీచర్లకు పేస్కేల్, మాడల్, గురుకుల టీచర్లకు 010 పద్దు ద్వారా వేతనాలు వంటి హామీలిచ్చారు. ఇక తాజా ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి.. తాను చేసిన సేవలను, పోరాటాలను ఓటర్లకు వివరించారు. ఇక ఎమ్మెల్సీ నిధులను 100శాతం సర్కారు స్కూళ్ల బలోపేతానికే ఖర్చుపెట్టినట్టు చెప్పారు. జాక్టో నుంచి మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ పోటీచేస్తుండగా.. ఆయన బీసీ నినాదంతో ముందుకెళ్లారు. గతంలో ఎమ్మెల్సీగా పనిచేసినప్పుడు టీచర్లకు, విద్యారంగానికి అందించిన సేవలను వివరించారు. తపస్-బీజేపీ అభ్యర్థిగా పులి సరోత్తంరెడ్డి, టీపీఆర్టీయూ నుంచి హర్షవర్ధన్‌రెడ్డి, సీపీఎస్ఈయూ నుంచి కొలిపాక వెంకటస్వామి, సుందర్‌రాజ్‌యాదవ్ మరికొందరు అభ్యర్థులు బరిలో ఉన్నారు.
కరీంనగర్లో రసవత్తర పోరు..
ఉమ్మడి కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో పోరు రసవత్తరంగా మారింది. తాజా ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి మరోసారి పోటీచేస్తున్నారు. పీఆర్టీయూటీఎస్ టికెట్లు అమ్ముకున్నట్టు ఆయన ఆరోపణలు గుప్పించారు. అనుభవం, ఆరేండ్ల పదవీకాలంలో తాను చేసిన సేవలు కలిసొస్తాయని, టీచర్లతో తనకున్న సంబంధాలు అనుకూలంగా మారుతాయని అంచనాలేస్తున్నారు. కార్పొరేట్, రియల్ ఎస్టేట్ వ్యాపారులను కాకుండా టీచర్నైన తనను గెలిపించాలని ప్రచారం చేశారు. ఇక తపస్-బీజేపీ నుంచి మల్క కొమురయ్య పోటీచేస్తుండగా ఆయన తనను గెలిపిస్తే జిల్లా పరిషత్, ప్రభుత్వ, గురుకుల టీచర్ల సమస్యలను పరిష్కరిస్తానని హామీలిచ్చారు. గురుకుల టీచర్లకు 010 జీరో పద్దు ద్వారా వేతనాలు, గురుకుల టీచర్లకు పదోన్నతులు, మహిళా టీచర్లకు రాత్రి డ్యూటీల నుంచి మినహాయింపునకు ప్రయత్నిస్తానని చెప్పారు.
పీఆర్టీయూటీఎస్ నుంచి వంగ మహేందర్‌రెడ్డి పోటీ చేస్తుండగా ఆయన ఉమ్మడి సర్వీస్‌రూల్స్, మెరుగైన పీఆర్సీ, నగదురహిత వైద్యం, కేజీబీవీ, గురుకుల కాంట్రాక్ట్ ఉద్యోగులకు పేస్కేల్స్ వంటి హామీలిచ్చారు. ఈ నియోజకవర్గంలో పీఆర్టీయూకు ఉన్న బలం, 40 టీచర్ సంఘాలు మద్దతివ్వడం కలిసొస్తుందన్న ధీమాతో ఆయన ఉన్నారు. ఇక సీపీఎస్ఈయూ నుంచి తిరుమలరెడ్డి ఇన్నారెడ్డి పోటీచేస్తుండగా ఆయన సీపీఎస్ రద్దు, పాత పింఛన్ అమలు ప్రధాన డిమాండ్‌తో సీపీఎస్ టీచర్ల మద్దతును కూడగట్టారు. టీపీటీఎఫ్ నుంచి అశోక్‌కుమార్, మామిడి సుధాకర్‌రెడ్డి సహా మరికొందరు అభ్యర్థులు సైతం బరిలో ఉన్నారు. ఇక ఉమ్మడి కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గంలో పోరు ఉత్కంఠగా మారింది. బీజేపీ నుంచి చిన్నమైల్ అంజిరెడ్డి, కాంగ్రెస్ నుంచి వీ నరేందర్‌రెడ్డి(అల్ఫోర్స్), బీఎస్పీ నుంచి ప్రసన్న హరికృష్ణ, కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్‌సింగ్, ట్రస్మా మాజీ అధ్యక్షుడు యాదగిరి శేఖర్‌రావు తదితరులు బరిలో నిలిచారు.