గిరిజనులు ఇప్పటికే సాగు చేసుకొంటున్న భూములకు పట్టాలిస్తాం. సర్వే పూర్తయ్యింది.ఇంకా ఎవరన్నా భూమిలేకుండా, ఉపాధి లేకుండా ఉంటే దళితబంధు తరహాలో గిరిజనబంధు పథకాన్ని ప్రారంభిస్తామని స్వయంగా ప్రకటించిన. రాష్ట్రంలో గిరిజనులు వేరు, దళితులు వేరు, హిందువులు.. ముస్లింలు వేరు అని కొందరనుకొంటున్నరు. కానీ ఆ భావన మాకు లేదు. భేషజాలు లేవు.తెలంగాణలో ఏ బిడ్డ అయినా మా బిడ్డనే. తెలంగాణలో అందరూ అభివృద్ధి అయితేనే తెలంగాణ అభివృద్ధి అయితదని కుండబద్దలు కొట్టినట్టు అనేకసార్లు ప్రకటించినం. ఉద్యమ సమయంలో చెప్పినం. ఇప్పుడూ అదే చెప్తున్నం
– సీఎం కేసీఆర్
అడవుల పెంపుకోసం వేలకోట్లు ఖర్చుచేస్తున్నాం ప్రభుత్వం కఠినంగా ఉంటేనే అటవీ రక్షణ సాధ్యం ఒక్క గజం అడవి ఆక్రమించినా పట్టాలు రద్దు పట్టాలు పొందినవాళ్లే..అడవికి కాపలాదారులు ఆ మేరకు రాతపూర్వకంగా హామీలు తీసుకుంటం పోడు అంటే 20-30 ఎకరాల ఆక్రమణ ఉంటదా? గత ప్రభుత్వాల విధానాలతోనే సమస్య జటిలం మా ప్రభుత్వానికి అన్ని వర్గాలూ సమానమే గిరిజన హక్కులను అందరూ కాపాడాల్సిందే అదే సమయంలో పోడు హక్కు కాదని గుర్తించాలి ఈ సమస్యకు ఇంతటితో ముగింపు పలుకుదాం అటవీ సరిహద్దుల్లో సాయుధ గస్తీ ఏర్పాటుచేస్తాం అడవులను, ప్రజలను కాపాడటమే మా నిబద్ధత
పది మంది బాగుకోరే తత్వం, అనుకున్నది సాధించేదాక వదిలిపెట్టని దృఢత్వం, చెప్పింది చేసి చూపించే ధీరత్వం తొణికిసలాడే అరుదైన నేత సీఎం కేసీఆర్. అసెంబ్లీ వేదికగా రెండు చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో మొదటిది పోడు భూములకు పట్టాలివ్వనున్నట్టు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. ఈ నెలాఖరులోగా 11.5 లక్షల ఎకరాల పంపిణీకి సంకల్పించారు. ఈ పట్టాల కోసం తరాలుగా ఎన్నో ఉద్యమాలు జరిగాయి. మరెంతో రక్తపాతం జరిగింది. అడవులను పరిరక్షించడమే కాదు.. ఆ అడవులను నమ్ముకుని బతికే వేలాది గిరిపుత్రుల సంక్షేమాన్ని కూడా కేసీఆర్ కాంక్షించారు.
తమను ఎస్టీలుగా గుర్తించాలని 11 కులాలు దశాబ్దాల తరబడి పోరుతున్నా సమైక్య పాలకులు పట్టించుకున్న పాపాన పోలేదు. వారి పోరాటానికి సీఎం కేసీఆర్ ముగింపు పలికారు. ఇన్నేండ్లు అన్యాయానికి గురైన ఆ 11 కులాలను ఎస్టీ జాబితాలోకి చేరుస్తూ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానం ఏకగ్రీవ ఆమోదం పొందింది. ఏడేండ్లుగా కేంద్రం పట్టించుకోని ఈ డిమాండ్‌పై కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ): పోడు భూములకు ఈ నెలాఖరులోపు పట్టాలిస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అసెంబ్లీలో శుక్రవారం ప్రకటించారు. పట్టాలు పంపిణీచేశాక ఆయా భూములకు రైతుబంధు, విద్యుత్తు, నీటి సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. భూమిలేని గిరిజన బిడ్డలకు గిరిజనబంధు ఇచ్చి సాయం చేస్తామని చెప్పారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో పోడు భూముల అంశంపై భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య, ములుగు ఎమ్మెల్యే అనసూయ (సీతక్క), నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి వేసిన ప్రశ్నలకు మంత్రి సత్యవతి రాథోడ్ సమాధానమిచ్చాక సీఎం కేసీఆర్ ఈ అంశంపై మాట్లాడారు. ‘పోడు భూములు, అటవీ భూములను ఆక్రమించటం హక్కు కాదని, అది చట్ట వ్యతిరేక చర్య కిందకే వస్తుందని సీఎం స్పష్టంచేశారు. ‘అసెంబ్లీలో గిరిజనుల గురించి మాట్లాటం చాలా తేలికగా ఉంటది. అందంగానే ఉంటది. పొండెం వీరయ్య భద్రాచలంలో నన్ను కలిసి ఈ అంశంపై మాట్లాడారు.
పోడు భూములు హక్కు అన్నట్టు మాట్లాడుతున్నారు.. కానీ అది హక్కుకాదు.. ఆక్రమణ, ఒక రకంగా చెప్పాలంటే దురాక్రమణ అని చెప్పిన’ అని గుర్తుచేశారు.గతంలో ఉన్న ప్రభుత్వాలు సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్లే పోడు భూముల అంశం సంక్లిష్టంగా మారిందని, అది ఇప్పుడు కొన్ని పార్టీలకు ఆట వస్తువులా తయారయ్యిందని సీఎం కేసీఆర్ విమర్శించారు. ‘మాట్లాడితే పోడు భూములని నలుగురిని వెంటేసుకొని నాలుగు జెండాలు పట్టుకొని కలెక్టరేట్ల ముందు ధర్నాలు చేస్తూ హీరోలమన్నట్టు ప్రవర్తిస్తున్నారు. ఎమ్మెల్యేలుగా, రాష్ర్టాన్ని నడిపే పెద్దలుగా మన మీద బాధ్యత ఉంటది. గిరిజనులు అడవి బిడ్డలు. వారి హకులు కాపాడాల్సిందే. వాళ్లమీద ఎవరూ దౌర్జన్యం చేయకుండా చూడాల్సిందే. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ రాష్ట్రంలో అటవీ సంపద ఉండాలా? కనుమరుగు కావాలా? దిస్ ఈజ్ ది పాయింట్. అడవులను కాపాడకుంటే ఉద్యోగాలు పోతాయని సర్పంచ్‌లు, కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్మన్లకు ఇదే సభలో స్పష్టంచేశాను.
పంచాయితీరాజ్ కార్యదర్శులకు ప్రొబేషన్ పెడితే తప్ప మొక్కలు నాటలేకపోయినం. మొత్తం అడవులు ఎవరి పుణ్యాన నాశనమైనవో మనందరికీ తెలుసు. మన పక్కనే ఉండే నర్సాపూర్‌లో ఎట్లా సినిమా షూటింగులు అవుతుండెనో.. మనకండ్లముందు నర్సాపూర్ అడవి ఎట్లా ఎడారైందో చూశాం. మొత్తం అటవీ సంపదను పునరుజ్జీవింపజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. అందుకు అనేక అవార్డులు కూడా వచ్చాయి. అడవుల పెంపుకోసం వేల కోట్ల రూపాయలు ఖర్చుచేస్తున్నం. రాష్ట్రంలో 7.8 శాతం గ్రీన్ కవర్ పెరిగిందని ప్రశంసలు వస్తున్నాయి’ అని తెలిపారు.
గిరిజన బంధు ఇస్తాం
పోడు భూములపై రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక విధానమున్నదని సీఎం కేసీఆర్ తెలిపారు. ‘గిరిజనులు ఇప్పటికే సాగు చేసుకొంటున్న భూములకు పట్టాలిస్తాం. సర్వే పూర్తయ్యింది. అన్ని నియోజకవర్గాల్లోనూ నివేదికలు సిద్ధమయ్యాయి. ఈ పోడు వ్యవహారం ఇలాగే కొనసాగుతుండాలా? దీనికి ముగింపు పలకాలా అన్నదే ప్రశ్న. ఇటీవలే గిరిజన సంక్షేమశాఖ మంత్రి, ఇతర ఎమ్మెల్యేల సారథ్యంలో ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించిన గిరిజన పెద్దల సమావేశంలో నేను స్పష్టం చేసిన.. మన రెవెన్యూ బాగున్నది.. స్థితిగతులు బాగున్నాయి.. పోడు భూముల పంపిణీ తర్వాత ఇంకా ఎవరన్నా భూమిలేకుండా, ఉపాధి లేకుండా ఉంటే దళితబంధు తరహాలో గిరిజనబంధు పథకాన్ని ప్రారంభిస్తామని స్వయంగా ప్రకటించిన. రాష్ట్రంలో గిరిజనులు వేరు, దళితులు వేరు, హిందువులు.. ముస్లింలు వేరు అని కొందరనుకొంటున్నరు. కానీ ఆ భావన మాకు లేదు. భేషజాలు లేవు. తెలంగాణలో ఏ బిడ్డ అయినా మా బిడ్డనే. తెలంగాణలో అందరూ అభివృద్ధి అయితేనే తెలంగాణ అభివృద్ధి అయితదని కుండబద్దలు కొట్టినట్టు అనేకసార్లు ప్రకటించినం. ఉద్యమ సమయంలో చెప్పినం. ఇప్పుడు అదే చెప్తున్నం’ అని స్పష్టంచేశారు.
అంతా ఒప్పుకుంటేనే పట్టాలిస్తాం
రాష్ట్రంలో 66 లక్షల ఎకరాల అటవీ భూములున్నాయని సర్వేలో తేలిందని సీఎం కేసీఆర్ తెలిపారు. ‘అటవీశాఖకు స్వయంగా కౌన్సెలింగ్ చేసి వీటిని కాపాడేందుకు గిల్లికజ్జాలు పెట్టుకోవద్దని చెప్పిన. పోడుపై తుది నిర్ణయం తీసుకొనేందుకు గ్రామ కమిటీలు, మండల కమిటీలు, జిల్లా కమిటీలు వేసినం. అవి నివేదికలు సిద్ధంచేసి ఉంచాయి. కానీ నేను కఠినంగా చెప్తున్నా.. మేం ఇప్పుడే పట్టాలు ఇయ్యం. అందరికీ తెలియాలనే చెప్తున్న.. రాష్ట్రంలో అడవుల నరికివేత ఉండదు. పోడు భూములుండవని సర్పంచ్ స్థాయి నుంచి ఎంపీటీసీ గిరిజన ప్రతినిధులు, అఖిలపక్ష రాజకీయ నాయకులు సంతకాలు పెట్టి ఒప్పుకొంటే 11.5 లక్షల ఎకరాల పోడు భూములకు పట్టలివ్వడానికి మేం సిద్ధంగా ఉన్నాం. ఇప్పటివరకు దున్నుకొంటున్న వారికి పట్టాల్సిస్తాం. ఈ ప్రక్రియలో కాస్త లిబరల్గా పొమ్మని అధికారులకు ఆదేశాలిచ్చాం’ అని తెలిపారు.
గొత్తికోయలను తీసుకొచ్చి
పనిగట్టుకొని ఛత్తీస్‌గఢ్ నుంచి గొత్తికోయలను తీసుకొచ్చి రాత్రికి రాత్రి దుర్మార్గంగా అడవులను నరికివేయిస్తున్నారని సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘గిరిజనులపై దాడులు చేస్తున్నారని కొంతమంది ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నరు. ఫారెస్ట్ అధికారి శ్రీనివాస్‌రావును ఎవరు చంపేసిండ్రు? అటవీ అధికారులపై దాడులు చేసి చంపేయవచ్చునా? ఇది ధర్మమేనా? దానిని సమర్థిద్దామా? శ్రీనివాస్‌రావు కుటుంబానికి రూ.50 లక్షలిచ్చి, ఆయన కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగమిచ్చి ఆదుకొన్నం. గిరిజనుల మీద అటవీ అధికారులు దాడి చేయొద్దు. గిరిజనులు వాళ్ల నియంత్రణలో వాళ్లు ఉండాలే. వాళ్ల బ్రతుకుదెరువు వేరు. అంతేగాని హత్యాకాండ చేస్తం.. అధికారులను చంపేస్తం అంటే చట్టం చేతులు ముడుచుకొని కూర్చోదు. గిరిజనులను రెచ్చగొట్టడం, వారి తరఫున మాట్లాడినట్టు నటించడం కాదు.. గిరిజనులను కాపాడుకోవాలే. అటవీ సంపదను కాపాడుకోవాలి.
రాష్ర్టాన్ని కాపాడుకోవాలే. ఎవ్వరైనా మన బిడ్డలే కాబట్టి తప్పకుండా న్యాయం చేద్దాం. అటవీ భూములను కొట్టేస్తం.. పట్టాలియ్యమంటే చట్టం ఒప్పుకోదు. గిరిజనుల విషయంలో మేం చాలా ఉదారంగా వ్యవహరిస్తున్నం. ఆదిలాబాద్, ఉట్నూరు, వరంగల్ జిల్లాల్లోని ఆర్వోఎఫ్ఆర్కు రైతుబంధు ఇవ్వాలని ఎమ్మెల్యే జోగు రామన్న, మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఇతర ఎమ్మెల్యేలు కోరితే దయతలిచి ఇస్తున్నం. నన్ను ఎవ్వరు కోరలే.. దరఖాస్తు పెట్టలే. నేనే భద్రాచలంసహా ఇతర గిరిజన ప్రాంతాల్లో 400 కోట్లతో త్రీ ఫేజ్ కరెంట్ ఇప్పిచ్చిన. ఇప్పటికే సర్వే పూర్తయిన 11.5 లక్షల ఎకరాల పోడు భూములను మీ (ఎమ్మెల్యేలు) సమక్షంలోనే పంచిపెడుదాం. అసెంబ్లీ ముగిసిన తర్వాత ఫిబ్రవరి చివరి వారంలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేసి ఆ తర్వాత లబ్ధిదారులకు భూములు ఇద్దామనుకొంటున్నం’ అని చెప్పారు.
గజం ఆక్రమించినా ఊరుకోబోం
పోడు భూములకు పట్టాలు ఇచ్చిన తర్వాత అడవిలో ఎవ్వరైనా ఒక్క గజం భూమిని ఆక్రమించినా సహించబోమని సీఎం స్పష్టంచేశారు. ‘ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు, పోడు పట్టాలపై పటిష్ఠమైన లెక్క తేలిన తర్వాత ఎమ్మెల్యేలకు లేఖలు రాద్దాం. అసెంబ్లీకి సమర్పిద్దాం. ఆ తర్వాత ఒక్క గజం అటవీ భూములను ఎవ్వరు అక్రమించేందుకు వీల్లేదు. ఆక్రమిస్తే ప్రభుత్వం అంగీకరించదు. వాతావరణ సమతుల్యత దెబ్బతింటే, గ్రీన్‌కవర్ దెబ్బతింటే వన్యప్రాణలు నశిస్తే, సమాజానికే ప్రమాదం. కాబట్టి ఒకవైపు అడవులను..మరోవైపు ప్రజలను కాపాడుకోవడమే మా నిబద్ధత. పోడు భూమలిచ్చిన తర్వాత కుటుంబాల వివరాలను సేకరిస్తాం. జనాభా గణన చేపడుతాం. భూములు లేనికి వారికి గిరిజనబంధు అమలుచేస్తం. అందరి సంతకాలు తీసుకొని, అండర్‌టేకింగ్ తీసుకొని పట్టాలు ఇస్తం. దీనికి అందరూ రాజీపడాల్సిందే. అలాగైతేనే పట్టాలు ఇస్తం. ఈ నిబంధనకు అంగీకరించని గ్రామాల్లో పట్టాలు ఇవ్వం. గిరిజన ఎమ్మెల్యేలు సైతం ఈ విషయంపై ప్రజలను చైతన్యం చేయాలి. ఆ తర్వాత పోడు కొడుతమంటే ప్రభుత్వం క్షమించదు’ అని హెచ్చరించారు.
సాయుధ గస్తీ ఏర్పాటు చేస్తాం
రాష్ట్రంలో పోడు భూముల పంపిణీ ఇదే చివరిదని సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు. ‘ఇప్పుడు పోడు భూములు పంచిన తర్వాత మళ్లీ పోడు ఉండదు. ఇంచు ఆక్రమణకు గురికాకుండా చూస్తాం. అటవీ సరిహద్దులు నిర్ణయించి సాయుధ గస్తీ ఏర్పాటు చేస్తాం. ఒక్క చెట్టును కొట్టనియ్యం. ఏజెన్సీ గ్రామాల్లో గిరిజనులకే పట్టాలు లభిస్తాయి కాబట్టి కొంతమంది అగ్రకులాల వాళ్లు గిరిజన అమ్మాయిలను పెండ్లి చేసుకొని అటవీ భూములు కబ్జా చేస్తున్నరు. పోడు కొట్టుకోవడమంటే 20-30 ఎకరాలుంటదా? ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో ఇలాంటి ఉదాహరణలున్నాయి. వాళ్ల వివరాలు సభముందు పెట్టమంటే పెడుతం. వాళ్లను సమర్థిద్దామా? గిరిజనుల పేరిట జరుగుతున్న దోపిడీని ఎమ్మెల్యేలంతా అరికట్టాలి. భవిష్యత్తులో అటవీ దురాక్రమణ కాకుండా చూడాలి. పర్యావరణ పరిరక్షణకు మరిన్ని చర్యలు చేపడతాం. అడవుల రక్షణ అనేది మనందరి బాధ్యత’ అని సీఎం పేర్కొన్నారు.
పోడు పట్టాదారులే.. కాపలాదారులు కావాలే
ఎన్నికల కోసం పోడు భూములు పంచే కార్యక్రమాన్ని ప్రభుత్వం ఎప్పటికీ చేపట్టదని సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు. ‘ఎన్నికలు వస్తున్నయ్ కాబట్టి పొలోమని సర్టిఫికెట్లు ఇవ్వండి.. ఒక్క ఎకరం ఉన్నా, పదెకరాలకు సర్టిఫికెట్లు ఇవ్వండి అనే దందాలు మేం చేయం. గతంలో ఇలాగే చేసిన్రు. అ కథ చాలా పెద్దగున్నది. ఏ పెద్దలు చేసినరో.. ఏ ప్రభుత్వాలు ఎట్ల ఇచ్చినయో, ప్రజలను ఎట్లా మోసం చేసిన్రో చరిత్రల ఉన్నది. మేం ఆ విధంగా చేయదల్చుకోలేదు. పోడు భూములతోపాటు.. తాతలు తండ్రులు సంపాదించిన సొంత భూములున్నయి. వాటితోపాటు కొత్తగా ఇచ్చే 11.5 లక్షల ఎకరాలకు పట్టాలిచ్చిన తర్వాత భూమి ఉన్న రైతుల లెక్క తేలుతుంది. భూములకు పట్టాలివ్వడంతోపాటు రైతుబంధు ఇస్తాం.
కరెంట్ కనెక్షన్లు ఇస్తాం. తమాషాకు మేం ఏదో చెయ్యం. ఓట్లప్పుడో మాట.. ఓట్ల తెల్లారి ఇంకో మాట మాట్లాడే అవసరం మాకు లేదు. ఫిబ్రవరి నెలాఖరులో పోడుభూములకు పట్టాల్సిస్తాం. గిరి వికాసం కింద నీటి సదుపాయం కల్పిస్తాం. కానీ పోడు పట్టాలు పొందిన వాళ్లే అడవిని కాపాడే కాపలాదారులు కావాలె. వాళ్లతో రాతపూర్వకంగా ఈ మేరకు హామీలు తీసుకొంటాం. చట్టాలు అతిక్రమించి అడవులు నరికితే పట్టాలు రద్దుచేస్తాం. పోడు భూముల పేరుతో డ్రామా చేయద్దు. ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సోదరుడు కల్పించుకొంటే ఆయనపైనా కేసు నమోదయ్యింది. అటవీ అధికారుల దురుసు ప్రవర్తన కూడా కొంచెం ఉన్నది. నేను గతంలోనే గట్టిన చెప్పిన.. దురుసుగా ప్రవర్తించవద్దని మరోసారి చెప్తాం’ అని సీఎం పేర్కొన్నారు.
పోడు హకు పత్రాలిస్తామని ప్రకటించడం హర్షణీయం
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
రాష్ట్రంలో 11.5 లక్షల ఎకరాలకు పోడు హకు పత్రాలు ఇస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్పష్టంగా శాసనసభలో ప్రకటించడం హర్షణీయమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. పోడు పట్టాలతో పాటు ఇతర సౌకర్యాలను కల్పిస్తామని చెప్పడం సంతోషకరమని చెప్పారు. అసెంబ్లీలో సీఎం ఇచ్చిన హామీని వెంటనే అమలు జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.
పోడు భూముల పంపిణీపై విస్తృత కసరత్తు
సీఎం ప్రకటన నేపథ్యంలో పోడు భూముల పంపిణీపై అధికారులు కసరత్తు వేగవంతం చేశారు. పోడు భూములపై 28 జిల్లాలు, 295 మండలాలు, 2,845 గ్రామ పంచాయతీల పరిధిలో ఫారెస్ట్ రైట్ కమిటీలు ఆరేడు నెలలుగా విస్తృత కసరత్తు చేస్తున్నాయి. వివిధ స్థాయిల్లో 12,49, 296 ఎకరాలకు సంబంధించి 4,14, 353 దరఖాస్తులు అధికారులు స్వీకరించారు. గిరిజనులు, గిరిజనేతరుల నుంచి వచ్చిన దరఖాస్తుల పరిశీలన వేగంగా సాగుతున్నది.