హైదరాబాద్, మే 6 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు పెరిగాయంటూ వరంగల్ సభలో కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యల్లో ఏ మాత్రం వాస్తవం లేదని కేంద్ర ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. నిజానికి 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పాలించిన సమయంలోనే రైతుల ఆత్మహత్యలు ఎక్కువగా నమోదయ్యాయి. నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డుల ప్రకారం ఆ పదేండ్లలో తెలంగాణలో దాదాపు 16,963 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకొన్నారు. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 7,000 కుటుంబాలకు మాత్రమే నష్టపరిహారం చెల్లించి, చేతులు దులుపుకొన్నది. తెలంగాణ ఏర్పాటుకు పూర్వం ఏటా 1,500 నుంచి 2,000 వరకు రైతుల ఆత్మహత్యలు నమోదయ్యాయి. వ్యవసాయ రంగంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరించిన అస్థవ్యస్థ విధానాలు రైతుల ఆత్మహత్యలకు దారితీస్తే, ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన పథకాలు, కార్యక్రమాలు తెలంగాణ రైతుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించాయి.
వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తు, మిషన్ కాకతీయ పథకం కింద చెరువుల పునరుద్ధరణ, కాళేశ్వరం తదితర ప్రాజెక్టుల నిర్మాణం, సకాలంలో ఎరువులు, నాణ్యమైన విత్తనాల సరఫరా, రైతుబంధు, రైతుబీమా లాంటి పథకాలు, రుణమాఫీ అమలు తదితర కార్యక్రమాలు రైతుల జీవితాల్లో నూతనోత్సాహం నింపాయి. వ్యవసాయాన్ని పండుగలా మార్చాయి. ఒకప్పుడు వ్యవసాయాన్ని వదిలేసి వెళ్లినవారు సైతం ఇప్పుడు మళ్లీ వ్యవసాయరంగం వైపు దృష్టి సారిస్తుండటం ఇటీవల స్పష్టంగా కనిపిస్తున్న మార్పు. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు పథకం కింద ఇప్పటివరకు 8 విడతల్లో రూ.50 వేల కోట్లకు పైగా రైతులకు పెట్టుబడి సహాయం అందించింది.
ఏ రాష్ట్రం కూడా రైతులకు ఇంత పెద్ద మొత్తంలో సహాయం చేయలేదు. దీనికితోడు ఏ కారణం చేతనైనా రైతు మరణిస్తే.. ఆ రైతు కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున బీమా పరిహారం చెల్లించి అండగా నిలుస్తున్నది. ఇలాంటి పరిణామాలన్నీ రైతుల్లో నైరాశ్యం పోగొట్టాయి. తెలంగాణ రాష్ట్రంలో గత ఐదేండ్లలో రైతుల ఆత్మహత్యలు గణనీయంగా తగ్గిపోయినట్టు టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి పార్లమెంటులో అడిగిన ప్రశ్నకు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ లిఖితపూర్వకంగానే సమాధానం ఇచ్చారు. రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో 1,358గా నమోదైన రైతుల ఆత్మహత్యలు 2020లో 466కు తగ్గిపోయాయన్నది కేంద్రం చెప్పిన లెక్క. అయితే ఈ ఆత్మహత్యలకు వ్యవసాయ నష్టాలు మాత్రమే కారణం కాదని, కుటుంబ సమస్యలు, అనారోగ్య సమస్యలు కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని కేంద్రం పేర్కొన్నది.
అదే పార్లమెంటులో సభ్యుడిగా ఉన్న రాహుల్‌గాంధీ రాష్ట్రంలో ఆత్మహత్యలు పెరిగాయంటూ అడ్డగోలుగా వ్యాఖ్యానించడం పట్ల టీఆర్ఎస్ శ్రేణులు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ వ్యవసాయ రంగాన్ని గాడినపెట్టిన విషయాన్ని విస్మరించి, రాహుల్‌గాంధీ అవగాహన రాహిత్యాన్ని చాటుకొన్నారనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.