హైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ) : యూరియా కొరత విషయంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రైతులతో రాజకీయ క్రీడ ఆడుతున్నాయనే విమర్శలొస్తున్నాయి. ఇంతగనం ఎరువులు తీసుకెళ్లి ఏం చేస్తున్నరని కేంద్రం ప్రశ్నిస్తుంటే, కేంద్రం ఇస్తలేదని రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేస్తున్నది. మొత్తానికి, యూరియా కొరత సమస్యను తీర్చేందుకు ఏ ప్రభుత్వం కూడా చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదనే విమర్శలొస్తున్నాయి. ఈ రెండు పార్టీల రాజకీయ క్రీడలో చివరికి రైతులకు తీరని అన్యాయం జరుగుతున్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యంతో రాష్ట్రంలో యూరియా కొరత రోజురోజుకీ తీవ్రమవుతున్నది. మార్కెట్లో దళారులు, వ్యాపారులు యూరియా ధరను భారీగా పెంచేసి రైతులను నిలువుదోపిడీ చేస్తున్నారు. రూ.266 అమ్మాల్సిన యూరియా బస్తాను రూ.400 వరకు విక్రయించి రైతులను దోపిడీ చేస్తున్నారు.
ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డాను కలిసిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రాష్ర్టానికి కేటాయించిన యూరియాను సకాలంలో సరఫరా చేయాలని కోరారు. దీనిపై స్పందించిన నడ్డా బుధవారం కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో యూరియా వినియోగం భారీగా పెరుగుతున్నదని, ఇంత భారీ మొత్తంలో తీసుకెళ్లి ఏం చేస్తున్నారనే విధంగా కేంద్ర మంత్రి ప్రశ్నించినట్టు తెలిసింది. అంతేకాకుండా, యూరియా వాడకాన్ని తగ్గించి సేంద్రియ ఎరువుల వినియోగం పెంచాలంటూ రైతులకు ఉచిత సలహా ఇచ్చారు. దీంతో కేంద్ర ప్రభుత్వం యూరియా కొరత నెపాన్ని రైతులపై నెట్టే ప్రయత్నం చేస్తున్నదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రైతులు యూరియాను అధికంగా వినియోగించడం వల్లనే కొరత ఏర్పడిందనే విధంగా నడ్డా వ్యాఖ్యానించడం గమనార్హం. కేంద్ర మంత్రి వ్యాఖ్యలను గమనిస్తే రాష్ర్టానికి యూరియా కోత తప్పదనే సంకేతాలు ఇచ్చారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సీజన్ ప్రారంభమయ్యాక ఎరువుల కోటాపై కోతలు, కొర్రీలు పెట్టడం ఏమిటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఒకవేళ కేంద్ర మంత్రి చెప్పిన మాటలు నిజమే అయితే.. ఇందుకు సంబంధించి సీజన్ ప్రారంభానికి ముందే చర్యలు తీసుకోవాలి. రాష్ర్టానికి ముందుగానే కేటాయింపుల్లో కోత పెట్టాలి. దీంతోపాటు ఇక్కడి రైతులకు యూరియా కోతపై, సేంద్రీ య ఎరువుల వినియోగంపై అవకాగహన కల్పించాలి. అంతేకానీ, తొలుత ఎలాంటి ఆంక్షలు లేకుండా కోటా కేటాయించి.. తీరా సాగు మొదలయ్యాక కోతలు పెట్టడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్నది.
యూరియా సరఫరాలో కేంద్రం కోతలు, కొర్రీలు పెడుతుంటే రాష్ట్రం ప్రభుత్వం వాటిని ఎదుర్కోలేక చేతులెత్తేసిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. కేంద్రం ఈ వానకాలం సీజన్ కోసం తెలంగాణకు 9.28 లక్షల టన్నుల యూరియాను కేటాయించింది. ఇప్పటివరకు 3.35 లక్షల టన్నులు మాత్రమే సరఫరా చేసింది. ఇంకా 5.93 లక్షల టన్నుల యూరియా రాష్ర్టానికి రావాల్సి ఉన్నది. దీనిని తెప్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందనే విమర్శలున్నాయి. రైతులు ఎప్పటినుంచో యూరియా కోసం తిప్పలు పడుతుంటే రాష్ట్రం ప్రభుత్వం ఇప్పుడు నింపాదిగా స్పందించింది. రాష్ట్ర రైతుల తరఫున కేంద్రంపై పోరాటం చేసి యూరియాను తీసుకొనిరావాల్సిన ప్రభుత్వం.. వినతిపత్రాలకే పరిమితమవుతున్నదనే విమర్శలున్నాయి. తాజాగా కేంద్ర మంత్రి జేపీ నడ్డా వ్యాఖ్యలతో రాష్ర్టానికి యూరియా రావడం కష్టమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
లింగంపేట(తాడ్వాయి)/ఆదిలాబా ద్, జూలై 9 (నమస్తే తెలంగాణ): జూలై 9: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రైతులకు యూరియా కష్టాలు మొదలయ్యాయి. కామారెడ్డి జిల్లా తాడ్వాయి సహకార సంఘం కార్యాలయంలో బుధవారం పోలీస్ పహారా మధ్య రైతులకు యూరియా పంపిణీ చేశారు. 30 టన్నుల యూరియా వచ్చిందని తెలిసి అన్నదాతలు ఉదయం నుంచే సొసైటీ ఎదుట బారులు తీరారు. ఆదిలాబాద్ జిల్లాలో ఎరువుల కేంద్రాలు, ఫర్టిలైజర్ దుకాణాల వద్ద రైతులు వర్షంలో తడుస్తూ బారులు తీరారు. యూరియా బస్తాకు రూ.266.50 ఉండగా ప్రైవేట్ వ్యాపారులు రూ. 310 వరకు విక్రయిస్తున్నారు. బిల్లుల్లో మాత్రం ఎమ్మార్పీ రాస్తున్నారు. మహారాష్ట్రకు అక్రమంగా ఎరువులను తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. మహారాష్ట్రంలో యూరియా బస్తాను రూ. 400 వరకు విక్రయిస్తున్నట్టు స్థానికులు తెలిపారు.