హైదరాబాద్, జూన్ 26 ( నమస్తే తెలంగాణ): ఫోన్ ట్యాపింగ్ విషయంలో మీడియా సంయమనం పాటించాలని హైకోర్డు నిరుడు సూచించింది. అయినప్పటికీ కొన్ని మీడియా సంస్థల తీరు మారడం లేదు. వ్యక్తిగత గోప్యతను పట్టించుకోకుండా ఉద్దేశపూర్వకంగా కొందరు వ్యక్తులను లక్ష్యంగా చేసుకొని వార్తలను ప్రసారం చేస్తున్నాయి. అనుమానితులు, బాధితుల పేర్లు బయటపెడుతూ లైవ్ అప్డేట్స్ పేరుతో ‘అతి’ చేస్తున్నాయని పోలీసు వర్గాలు, మేధావులు అసహనం వ్యక్తంచేస్తున్నారు. ఈ వ్యవహారంలో రాజకీయ నాయకులు కూడా వెనక్కి తగ్గడం లేదు. బీఆర్ఎస్పై బురద చల్లాలనే ఏకైక లక్ష్యంతో అడ్డగోలు వ్యాఖ్యలు చేస్తున్నారు. కోర్టుల కన్నా ముందే నేరస్థులను ఖరారు చేస్తున్నారు.
రాజకీయ నేతలతో పాటు జడ్జీల ఫోన్లు కూడా ట్యాప్ చేశారంటూ పలు మీడియా సంస్థలు నిరుడు కథనాలు ప్రసారం చేశాయి. పలువురు న్యాయమూర్తుల పేర్లు, ఫోన్ నంబర్లను బహిర్గతం చేశాయి. ఈ కథనాల ఆధారంగా ఫోన్ ట్యాపింగ్ కేసును తెలంగాణ హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. జడ్జీల ఫోన్ నంబర్లను, బంధువుల పేర్లు, వ్యక్తిగత వివరాలను బయట పెట్టడంపై ఆందోళన వ్యక్తం చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో మీడియా సంయమనం పాటించాలని, బాధ్యతతో వ్యవహరించాలని నిరుడు జూలై 10న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం సూచించింది. ఫోన్ ట్యాపింగ్ కేసు వార్తలు రాసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, జడ్జీలు, వారి కుటుంబ సభ్యుల పేర్లు మీడియాలో ప్రసారం చేయొద్దని ఆదేశించింది.
సిట్ విచారణకు సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు లీక్ అవుతున్నాయి. ఫలానా వ్యక్తుల ఫోన్లు ట్యాప్ చేశారని, వారి బంధువులకు చెందిన ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయని పేర్లతో సహా బహిర్గతం చేస్తున్నారు. సిట్ అధికారులు ఎవరెవరికి నోటీసులు ఇచ్చారు, వారిని ఎప్పుడు విచారణకు పిలుస్తున్నారు, ఎకడికి పిలుస్తున్నారు వంటి వివరాలన్నీ కొన్ని మీడియా సంస్థలకు లీక్ అవుతున్నాయి. సాక్షుల వివరాలు కూడా బహిరంగంగా వెల్లడిస్తున్నారు. అంతేకాదు, లైవ్ అప్డేట్స్ పేరుతో వారు ఇంటి దగ్గర నుంచి కదిలింది మొదలు విచారణకు హాజరై తిరిగి ఇంటికి చేరే దాకా ప్రసారం చేస్తున్నారు. సాక్షులు, అనుమానితులు, నిందితుల వ్యక్తిగత వివరాలను బహిర్గతం చేయడం నిబంధనలకు విరుద్ధమని, ఇది వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించినట్టే అని న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అయినా కొన్ని మీడియా సంస్థలు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీడియాలో పదేపదే తమ పేర్లు రావడం వల్ల ఇబ్బందులు పడుతున్నామని పలువురు పేర్కొంటునారు.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రాజకీయ నాయకులు సైతం బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్, బీజేపీ నేతలు ఈ కేసును బీఆర్ఎస్ చేసిన తప్పిదంగా చూపెట్టేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, ఎంపీ బండి సంజయ్ తదితరులు సందర్భం వచ్చినప్పుడల్లా కాంగ్రెస్‌ను, బీఆర్ఎస్ను విమర్శించేందుకు ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని లేవనెత్తుతున్నారు. తాము అధికారంలో ఉండి ఉంటే దోషులకు ఇప్పటికే శిక్ష పడేదని బండి సంజయ్ ఇటీవల వ్యాఖ్యనించారు. తాజాగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ ఈ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా ఇప్పటివరకు ఈ కేసులో ఎలాంటి పురోగతి లేదు. దీనిని బట్టి ఈ కేసు ఎంత బలహీనమైందో అర్థమవుతున్నది.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విచారణ ఇంకా కొనసాగుతున్నది. సిట్ అధికారులు అనుమానితులు, నిందితులు, బాధితులను పిలిచి వాంగ్మూలం సేకరిస్తున్నారు. విచారణ పూర్తయిన తర్వాత దోషులు ఎవరో న్యాయస్థానం తీర్పు ఇస్తుంది. కానీ కొన్ని మీడియా సంస్థలు ఇప్పుడే దోషులు ఎవరో తేలిపోయినట్టు బ్రేకింగ్‌లు, బ్యానర్ స్టోరీలు కుమ్మరిస్తున్నాయి. కొందరు నేతలు, అధికారులను లక్ష్యంగా చేసుకొని దుష్ప్రచారం చేస్తున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకులను లక్ష్యంగా చేసుకుంటున్నాయి. విచారణ అనంతరం నిందితులు మీడియాతో మట్లాడకుండా వెళ్తే దానిని కూడా పెద్దగా చూపిస్తున్నాయి. మీడియా ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకుండా తప్పించుకుపోతున్నారని క్లిప్పింగులు వేస్తున్నాయి.