ఢిల్లీ, మార్చి 15 (నమస్తే తెలంగాణ): ఢిల్లీ మద్యం పాలసీ వివాదంలో ఈడీ ఇచ్చిన నోటీసులను రద్దు చేయాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈడీ ఈ నెల 7, 11 తేదీల్లో తనకు సమన్లు ఇచ్చిందని, మనీలాండరింగ్ నిరోధక చట్టం-2002లోని 50(2), 50(3) నిబంధనల మేరకు ఇచ్చిన నోటీసు అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వు జారీ చేయాలని కోరారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం వికలాంగులు, మహిళలను ఇండ్ల వద్దే విచారించాలని, ఈడీ ఈ నిబంధనలను ఉల్లంఘిస్తున్నదని పేర్కొన్నారు. తనను కార్యాలయానికి పిలిచి ఈడీ విచారించటం చట్టవ్యతిరేకమని ప్రకటించాలని కోరారు. తన ఇంటి దగ్గర ఈడీ విచారణ చేయటమో, లేకపోతే వీడియో కాన్ఫరెన్స్ విధానంలో దర్యాప్తు చేసేలా ఉత్తర్వులివ్వాలని కోరారు.
తనకు ఇచ్చిన నోటీసులో ఇతరులతో కలిసి విచారిస్తామని ఈడీ అధికారులు పేర్కొన్నారని, కానీ ఆ విధంగా విచారించలేదని చెప్పారు. తన ఫోన్‌ను కూడా చెప్పాపెట్టకుండా ఈడీ దర్యాప్తు అధికారులు జప్తు చేశారని, ఇది చట్టవ్యతిరేకమని విన్నవించారు. ఈ కేసులో సాక్షిగా ఉన్న ఈ శరత్‌చంద్రారెడ్డి విషయంలో ఈడీ క్రూరంగా వ్యవహరించిందని తెలిపారు. థర్డ్ డిగ్రీ ప్రయోగించటం వల్ల అతనికి వినికిడి సమస్య వచ్చిందని వెల్లడించారు. ఈ మేరకు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైనట్టు చెప్పారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ నేతల కుట్రల ఫలితంగా ఈడీ కేసులు నమోదు చేస్తున్నదని ఆరోపించారు. అనేక ఊహాగానాలతో సోషల్ మీడియాలో వార్తలు వచ్చేలాగా చేయటంలో ఈడీ పెద్దలున్నారని పేర్కొన్నారు. కేసులో ఒకరిని రిమాండ్‌కు తరలించిన తర్వాత ఈడీ మీడియాకు లీకులు ఇస్తున్నదని చెప్పారు. పిటిషనర్ వినతిని ఈడీ పట్టించుకోవడం లేదని చెప్పారు. తనకు వ్యతిరేకంగా నిరాధార ఆరోపణలు చేసే వాళ్లపై హైదరాబాద్‌లోని 9వ అడిషనల్ చీఫ్ జడ్జి కోర్టులో సూట్ దాఖలు చేసి మధ్యంతర ఉత్తర్వు పొందిన విషయాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చారు.
మహిళను కార్యాలయానికి పిలువొచ్చా?
ఈడీ నోటీసులను సవాల్ చేస్తూ కవిత సర్వోన్నత న్యాయస్థానంలో మంగళవారం 105 పేజీల రిట్ పిటిషన్ (క్రిమినల్) దాఖలు చేశారు. ఈడీ కార్యాలయానికి మహిళను విచారణకు పిలువవచ్చా? అని పిటిషన్లో ప్రశ్నించారు. తనపై ఏవిధమైన కఠిన చర్యలు తీసుకోకుండా, అరెస్టు చేయకుండా ఈడీని ఆదేశించాలని కోరారు. ఈ కేసును అత్యవసరంగా విచారించాలని, పిటిషనర్‌కు తక్షణమే ఉపశమనం కల్పించాలని కవిత తరుపు న్యాయవాది వందన విజ్ఞప్తి చేశారు. మహిళలను దర్యాప్తు సంస్థలు తమ కార్యాలయాలకు పిలిచి విచారించరాదని సుప్రీంకోర్టు గతంలో ఉత్తర్వులు ఇచ్చిందని గుర్తు చేశారు. ఇప్పటికే ఈడీ విచారణకు కవిత హాజరయ్యారని, 16న మరోసారి విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారని, ఈ వ్యవహారంపై స్టే ఇవ్వాలని కోరారు.
ఇబ్బందికరంగా ఈడీ తీరు
సుప్రీంకోర్టుకు కవిత దాఖలు చేసిన పిటిషన్లో పలు అంశాలను ప్రస్తావించారు. తాను తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కూతురిని అని పేర్కొన్నారు. గతంలో ఎంపీగా, ప్రస్తుతం నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్నట్టు వివరించారు. ఎంపీగా ఉన్నప్పుడు వివిధ పార్లమెంట్ కమిటీల్లో ఉన్నట్టు వెల్లడించారు. ఉపరాష్ట్రపతితో పాటు కొలంబియా, ఇతర దేశాలకు వెళ్లిన పార్లమెంట్ సభ్యుల కమిటీలో తాను ఉన్నట్టు చెప్పారు. రాజకీయంగా తమతో విభేదించే పార్టీ కేంద్రంలో అధికారంలో ఉండటం వల్లే ఈడీ వేధింపులకు గురిచేస్తున్నదని ఆరోపించారు. ఈ నెల 11న ఈడీ తనను రాత్రి 8.30 వరకు విచారించిందని తెలిపారు. ఇదే కేసులో సీబీఐ తనను ఇంటివద్దే విచారించిన సంగతి తెలియచేశారు.
ఎఫ్ఐఆర్లో తన పేరు లేనేలేదని, కొందరి వాంగ్మూలం ఆధారంగా తనను కేసులో ఇరికించే కుట్ర జరుగుతున్నదన్నారు. అరుణ్ రామచంద్రపిైళ్లెని బెదిరించి వాంగ్మూలం తీసుకున్నారని పేర్కొన్నారు. పిైళ్లె ఇటీవల తన వాంగ్మూలాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారని చెప్పారు. దీనిని తీవ్రంగా పరిగణించాలని కోరారు. అలాంటి వాళ్ల వాంగ్మూలానికి విశ్వసనీయత లేదంటూ వాటి ఆధారంగా తనను విచారణకు పిలవటం అన్యాయమని కవిత తన పిటిషన్లో వివరించారు.ఎమ్మెల్సీ కవిత చేసిన ఆరోపణలపై 24న విచారణ చేపడతామని ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ప్రకటించింది.
నేడు ఈడీ విచారణకు కవిత
ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన కేసును విచారిస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట ఎమ్మెల్సీ కవిత గురువారం మరోసారి హాజరుకానున్నారు. పార్లమెంటు సమావేశాలు, ఈడీ విచారణకు కవిత హాజరవుతున్న నేపథ్యంలో పలువురు పార్టీ నాయకులు ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో బీఆర్ఎస్ ఎంపీలందరూ ఢిల్లీలోనే ఉండగా.. బుధవారం మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, సత్యవతిరాథోడ్తోపాటు పలువురు ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ శ్రేణులు, జాగృతి కార్యకర్తలు పెద్ద ఎత్తున ఢిల్లీకి చేరుకున్నారు.