హైదరాబాద్, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ): ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించి రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్‌గౌడ్ ఫిర్యాదు ఆధారంగా పంజాగుట్ట పోలీసులు నమోదు చేసిన కేసులో దర్యాప్తు నిలిపివేస్తూ ఇచ్చిన ఆదేశాలను సవరించాలని కోరుతూ పోలీసులు గురువారం మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు. భోజన విరామ సమయంలో ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారణ చేపట్టాలని జస్టిస్ కే లక్ష్మణ్ బెంచ్‌ను పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావు కోరారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీశ్‌రావు, రాధాకిషన్‌రావు దాఖలు చేసిన పిటిషన్లపై దర్యాప్తును నిలిపివేస్తూ బుధవారం జారీచేసిన ఉత్తర్వులను సవరించాలని వాదించారు. ఈ కేసులో అరెస్టయిన ముగ్గురు నిందితుల కస్టడీ కోరుతూ కింది కోర్టులో పిటిషన్ దాఖలు చేశామని తెలిపారు.
కింది కోర్టులో వాదనలు పూర్తయ్యాయని, ఉత్తర్వులు వెలువడాల్సి ఉందని వివరించారు. దర్యాప్తును నిలిపివేస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల నేపథ్యంలో కస్టడీ పిటిషన్‌పై కింది కోర్టు నిర్ణయం తీసుకునే అవకాశం లేదని స్పష్టం చేశారు. ఒకవేళ కస్టడీకి అనుమతిస్తే, విచారణ కొనసాగిస్తే అది కోర్టు ధికరణ అవుతుందని పేర్కొన్నారు. దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ కింది కోర్టులో కస్టడీపై ఉత్తర్వులు వెలువరించాక శుక్రవారం ప్రస్తావించాలని, అప్పుడు తగిన నిర్ణయం వెలువరిస్తామని స్పష్టం చేశారు.