పటాన్చెరు, నవంబర్ 1 : గంజాయి స్మగ్లర్లతో సంబంధాలు నెరుపుతున్న ఇద్దరు ఎస్సై లు, ఒక హెడ్ కానిస్టేబుల్, మరో కానిస్టేబుల్‌ను మల్టీజోన్-2 ఐజీ వీ సత్యనారాయణ సస్పెండ్ చేశారు. పటాన్చెరు ఎస్సై అంబారియా, వీఆర్ ఎస్సై వినయ్‌కుమార్, సీసీఎస్ హెడ్ కానిస్టేబుల్ మారుతీనాయక్, ఏఆర్ కానిస్టేబుల్ మధును శుక్రవారం సస్పెండ్ చేస్తూ ఐజీ ఉత్తర్వులు జారీ చేశారు. గత మే నెలలో సంగారెడ్డి జిల్లా మనూర్ మండలం సనత్పూర్లో విధులు నిర్వహిస్తున్న ఎస్సై అంబారియా, కానిస్టేబుల్ మధు ఓ వాహనాన్ని అడ్డుకుని 120 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఆ సమయంలో వాహనంతోపాటు నిందితుడిని వదిలేశారు. మరో కేసులో గంజాయిని రవాణా చేస్తున్న ముఠాను నిజామాబాద్ జిల్లా వర్ని దగ్గర పట్టుకున్నారు. అక్కడి నుంచి వారిని నారాయణఖేడ్‌కు తీసుకుని వచ్చి 400 ప్యాకెట్ల గంజాయిని స్వాధీనం చేసుకుని వాహనంతో సహా నిందితుడిని వదిలేశారు. ఈ రెండు ఘటనలపై పోలీసు ఉన్నతాధికారులు విచారణ జరిపారు. విచారణ నివేదిక ఆధారంగా సదరు పోలీసు అధికారులను సస్పెండ్ చేశారు.