Drugs | హైదరాబాద్ సిటీబ్యూరో, జులై 15 (నమస్తే తెలంగాణ): డ్రగ్స్ దందాలో ఇద్దరు పోలీస్ అధికారుల కుమారులను ఈగల్ అధికారులు అరెస్టు చేశారు. వారిలో ఒకరిపై నిరుడు నిజామాబాద్‌లో కేసు నమోదైనా ఇప్పటివరకు అతడిని అరెస్టు కూడా చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఈగల్ అధికారులకు పట్టుబడిన కొంపల్లిలోని మల్నాడ్ కిచెన్ హోటల్ నిర్వాహకుడు సూర్య అన్నమనేని విచారణలో ఈ విషయాలు బయటపడ్డాయి. ఢిల్లీ నుంచి చెప్పులో కొకైన్ కొరియర్ చేయిస్తూ డ్రగ్స్ దందా చేస్తూ వారం క్రితం ఈ ముఠా పట్టుబడింది. నిందితుడు సూర్యతోపాటు అతడితో సంబంధాలున్న మరో ఆరుగురిని ఈగల్ (ఎలైట్ యాక్షన్ ఫర్ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్) అధికారులు అరెస్ట్ చేశారు. నిందితులను విచారణ నిమిత్తం పోలీస్ కస్టడీకి తీసుకొని ఈగల్ అధికారులు విచారించా రు. ఈ విచారణలో సూర్యకు వివిధ పబ్బు లు, హోటళ్ల నిర్వాహకులు, కస్టమర్లతో ఉన్న మరిన్ని సంబంధాలు బయటపడ్డాయి. పోలీసులు లోతైనా విచారణ జరపడంతో డ్రగ్స్ దందా నిర్వహిస్తున్న వారిలో ఇద్దరు పోలీస్ అధికారుల కొడుకులు ఉన్నారని, ఆ ఇద్దరు హోటల్ దందాలో ఉన్నట్టు పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు.
2024లోనే ఒకరిపై కేసు!
ఎస్ఐబీ (ఓఎస్డీ)గా పనిచేస్తున్న అధికారి కొడుకు రాహుల్ తేజ హోటల్ వ్యాపారాల్లో ఉన్నాడు. డ్రగ్స్ దందాలోనూ ఇతడి పాత్ర ఉంది. 2024లో నిజామాబాద్‌లో అతడిపై డ్రగ్స్ కేసు నమోదైంది, ఆ కేసులో మూడో నిందితుడిగా రాహుల్ తేజ ఉన్నట్టు ఈగల్ అధికారులు గుర్తించారు. సూర్యను ఈగల్ అధికారులు విచారిస్తుండగా, రాహుల్ తేజ పేరు బయటకు వచ్చింది. రాహుల్తేజ్పై ఏమైనా కేసులున్నాయా? అనే కోణంలో ఆరా తీయగా, నిజామాబాద్‌లో నమోదైన కేసు బయటపడింది. ఈ కేసులో రాహుల్ హిమచల్‌ప్రదేశ్, పంజాబ్, ఢిల్లీ తదితర ప్రాంతాల నుంచి డ్రగ్స్ తెచ్చి తమకు అమ్మేవాడని మిగతా నిందితులు చెప్పినట్టు ఆ కేసు పూర్వపరాల్లో ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఆ కేసులో ఏ3 నిందితుడైన రాహుల్ తేజ మినహా మిగతా వారంతా అరెస్ట్ కావడం, బెయిల్‌పై బయటకు రావడం జరిగింది. కానీ రాహుల్ తేజ బెయిల్ పొందకుండా, అరెస్ట్ కాకుండా ఉండటమేమిటని పోలీసులు ఆరా తీయడంతో నిందితుడు ఎస్ఐబీలో పనిచేస్తున్న ఓఎస్డీ కొడుకు కావడంతో అరెస్ట్ చేయలేదని సమాధానం వచ్చినట్టు తెలిసింది. దీంతో పోలీసులు సైతం షాక్‌కు గురయ్యారు.
మరో పోలీస్ అధికారి కొడుకు
సైబరాబాద్ కార్ హెడ్‌క్వార్టర్స్ డీసీపీగా పనిచేస్తున్న మరో అధికారి కొడుకైన మోహన్ అక్రమ దందా కూడా బయటపడింది. ఇతడు కూడా హోటల్ దందాలో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. హోటళ్లు, పబ్ వ్యాపారాలు నిర్వహించే మోహన్.. సూర్యతో స్నేహంగా ఉంటూ ఈ డ్రగ్స్ దందాలో చేరినట్టు పోలీసుల విచారణలో బయటపడటంతో అతడిని కూడా అరెస్ట్ చేశారు. ఈ ఇద్దరి అరెస్ట్‌తోపాటు మరింత మందికి మల్నాడ్ హోటల్ నిర్వాహకుడితో లింక్‌లు ఉన్నట్టు గుర్తించి, వారి గురించి కూడా ఆరా తీస్తున్నారు.