హైదరాబాద్, డిసెంబర్ 28(నమస్తే తెలంగాణ) : ఆర్టీసీ డ్రైవర్లపై పోలీసులు అత్యుత్సాహంతో కేసులు పెట్టడం తగదని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నేతలు హెచ్చరించారు. డ్రైవర్ల తప్పు లేకపోయినా కేసులు పెట్టి రిమాండ్‌కు తరలించడాన్ని జేఏసీ తీవ్రంగా ఖండించింది. ఆసిఫాబాద్ డిపో డ్రైవర్‌పై పెట్టిన అక్రమ కేసును వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ జేఏసీ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 23న ఆసిఫాబాద్ డిపో లహరి బస్సు డ్రైవర్ రామారావు హైదరాబాద్ నుంచి ఆసిఫాబాద్ వెళ్తుండగా రెబ్బన పోలీస్‌స్టేషన్ సమీపంలో బస్సును ఆపాడు. ఈ క్రమంలో వెనుక నుంచి బొలెరో వాహనం ఢీకొట్టడంతో కారు డ్రైవర్ తీవ్రగాయలతో చికిత్స పొందుతూ మరణించాడు. ఈ ఘటనలో రెబ్బన పోలీసులు ఆర్టీసీ డ్రైవర్‌పై కేసు పెట్టి అన్యాయంగా అరెస్టు చేయడం దుర్మార్గమని జేఏసీ పేర్కొన్నది. డ్రైవర్‌పై నాన్‌బెయిలబుల్ కేసు పెట్టి రిమాండ్‌కు పంపడం ఆర్టీసీ చరిత్రలో లేదని తెలిపారు. ఆర్టీసీ యాజమాన్యం ఈ ఘటనను సీరియస్‌గా తీసుకొని కేసును ఉపసంహరించుకునేలా చేయాలని జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న, వైస్ చైర్మన్ థామస్‌రెడ్డి, కన్వీనర్ ఎండీ మౌలానా, కో కన్వీనర్లు యాదయ్య, సురేశ్, యాదగిరి డిమాండ్‌చేశారు.