భద్రాచలం, నవంబర్ 23: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో శనివారం జరిగిన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటనలో పోలీసులు అత్యుత్సాహం చూపారు. సాక్షాత్తు సీఐ వాహనంలో ఓ అధికార పార్టీ నా యకుడిని తిప్పుతూ కనిపించారు. మంత్రి అధికారిక పర్యటన కావడంతోపాటు భద్రాచలం పట్టణంలోని ఓ ఫంక్షన్హాల్లో జరిగిన సమీక్షకు నియోజకవర్గంలోని వివిధ శాఖల అధికారులు చేరుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు అధికార పార్టీ నాయకులను దర్జాగా లోనికి పంపుతూ అధికారులను మాత్రం అక్కడే నిలిపివేసి అవమానించారు.
అంతేకాకుండా ఇంత లేటుగా వస్తే ఎలా అంటూ నిలదీశారు. అసహనానికి గురైన అధికారులు.. మంత్రితోపాటు డబుల్ బెడ్రూం ఇండ్లను పరిశీలించడానికి వెళ్లామని పోలీసులకు సమాధానం ఇవ్వాల్సి వచ్చింది. ఒకరిద్దరు అధికారులు పోలీసులపై సీరియస్ అవుతూ మీటింగ్ హాల్‌కు వెళ్లారు. అధికార పార్టీ యువ నేత ఒకరు సాక్షా త్తు సీఐ వాహనంలోనే కనిపించారు. మంత్రి పర్యటనలో పోలీసులు.. అధికార పార్టీ నేతలకు ఇచ్చిన మర్యాద తమకు ఇవ్వకపోగా అవమానించారంటూ అధికారులు మండిపడుతున్నారు.