జయశంకర్ భూపాలపల్లి : జిల్లా కేంద్రంలో(Jayashankar Bhupalapalli) రేపు జరగనున్న మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో పోలీసులు బీఆర్ఎస్ కౌన్సిలర్(BRS councillor), మాజీ వైస్ చైర్మన్ కొత్త హరిబాబు ఇంటిని బుధవారం తెల్లవారుజామున చుట్టుముట్టారు. ఆయనను అదుపులోకి తీసుకునేందుకు విశ్వప్రయత్నం చేశారు. తలుపులు పగలగొట్టేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు.
విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ శ్రేణులు, పాత్రికేయులు పెద్ద ఎత్తున హరిబాబు ఇంటి వద్దకు చేరుకున్నారు. దీంతో పోలీసులు తిరిగి వెళ్లిపోయారు. అరెస్టు చేసేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు. భూపాలపల్లిలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో నిర్మించిన శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించి హరిబాబు పై కేసు నమోదు అయిందని పేర్కొంటూ పోలీసులు అరెస్టు చేసే ప్రయత్నం చేశారు.
కాగా, తనకు మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికలకు సంబంధించి హాజరుకావాలని ఆర్డీవో నోటీసులు పంపించారు. ఇప్పుడు ఇలా అక్రమంగా అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని హరిబాబు ఒక వీడియో విడుదల చేశారు.