BRS Party | ఓరుగల్లు గడ్డ మీద ఎల్కతుర్తి వేదికగా కొనసాగుతున్న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు పోలీసులు ఆటంకాలు సృష్టిస్తున్నారు. అత్సుత్సాహం ప్రదర్శిస్తూ.. గులాబీ పండుగకు తరలివస్తున్న జనాలను పోలీసులు అడ్డుకుంటున్నారు. ఎల్కతుర్తికి వచ్చే నలు వైపులా దారులను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఎల్కతుర్తికి చేరుకునే మార్గాల్లో లారీలను అడ్డం పెట్టి.. బీఆర్ఎస్ సభకు తరలివస్తున్న ప్రజలకు ఆటంకం కలిగిస్తున్నారు. పోలీసుల వైఖరితో ఎటు చూసినా దాదాపు 12 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో పోలీసుల తీరుపై తెలంగాణ ప్రజలు మండిపోతున్నారు. బీఆర్ఎస్ పార్టీకి వస్తున్న ఆదరణను చూసి కాంగ్రెస్ ప్రభుత్వం తట్టుకోలేకపోతుందని ప్రజలు మండిపడుతున్నారు.
పోలీసులు సహకరించాలని, చెడ్డ పేరు తెచ్చుకోవద్దని సభా వేదిక నుంచి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ప్రజలను, వాహనాలను సభా ప్రాంగణానికి అనుమతించాలని కోరారు. ప్రభుత్వ పెద్దల మాటలు విని పోలీసులు చెడ్డ పేరు తెచ్చుకోవద్దని ఎర్రబెల్లి చెప్పారు.
బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభా ప్రాంగణం.. జనసంద్రంగా మారింది. ఇసుకెస్తే రాలనంతగా జనం తరలివచ్చారు. సభా ప్రాంగణమంతా చీమల దండులా తలపిస్తోంది. సభా ప్రాంగణానికి దాదాపు నాలుగైదు కిలోమీటర్ల వరకు జనం బారులు తీరారు. ఇక సభా ప్రాంగణంలో కళాకారుల ఆటపాటలకు జనం ఉరకలేస్తూ.. ఉత్సాహంతో డ్యాన్స్‌లు చేస్తున్నారు. తెలంగాణ పాటలతో గులాబీ సైనికులు, ప్రజలు ఊగిపోతున్నారు. గులాబీ జెండాలను రెపరెపలాడిస్తూ.. బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలుపుతున్నారు.