వికారాబాద్, జనవరి 19 : ఇటీవల గుర్తు తెలియని మహిళ హత్య(Woman murder) కేసును 48 గంటల్లో పోలీసులు ఛేదించారని వికారాబాద్(Vikarabad )జిల్లా ఎస్పీ కోటిరెడ్డి(SP Koti reddy) తెలిపారు. శుక్రవారం వికారాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్లో హత్యకు గల వివరాలను ప్రెస్మీట్లో వివరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. జనవరి 15న సంక్రాంతి పండుగ రోజు వికారాబాద్ మండలం పులుమద్ది గ్రామ శివారులో సగం కాలిపోయిన మహిళ శవం కనిపించిందని గ్రామ సర్పంచ్ మాధవరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మృతురాలు చేవెళ్లకు చెందిన ఎర్రోళ్ల అనసూయ (35) ఐదు సంవత్సరాల క్రితం భర్త చనిపోవడంతో కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించేది. ధారూరు మండలం రాజాపూర్ గ్రామానికి చెందిన అవుసుపల్లి బాబు కూలీ పనులు చేస్తున్న సమయంలో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. గత కొన్ని రోజుల క్రితం అనసూయ కొంత డబ్బును అప్పుగా తీసుకొని తిరిగి ఇవ్వక పోవడంతో గోడవలు ఏర్పడ్డాయన్నారు.
అనసూయను హత్య చేసేందుకు బాబు పథకం వేశాడు. జనవరి 14న వికారాబాద్లో మద్యం తీసుకొని ఆనసూయతో కలిసి సేవించాడు. ఇద్దరి మధ్య గొడవ రావడంతో కోపంతో బాబు ఆమె చీర కొంగుతో మెడకు చుట్టి హత్య చేశాడని తెలిపారు. శవాన్ని గుర్తించకుండా పెట్రోల్ తగలబెట్టి ఆమె ఒంటిపై ఉన్న కమ్మలు, కడియాలు, సెల్ఫోన్లను తీసుకెళ్లాడని పేర్కొన్నారు. 15న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
సెల్ఫోన్ నెంబర్, సీసీ టీవీల ఆధారంగా అవుసుపల్లి బాబును అదుపులోకి తీసుకొని అతనిని విచారించగా అసలు విషయం తెలిసిందన్నారు. మృతురాలి వద్ద తీసుకున్న కమ్మలు, కడియాలు, సెల్ఫోన్లను పోలీసులు రికవరీ చేసి, కేసు నమోదు చేశామన్నారు. హత్య చేసును ఛేదించిన పోలీసులను ఎస్పీ అభినందించారు.