హుజూరాబాద్, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఆస్తులను కాపాడుకునేందుకు అర్జంటుగా బీజేపీ కండువా కప్పుకుని పోటీలోకి దిగిన ఈటల రాజేందర్ పూటకో మాట, రోజుకో అబద్ధం వల్లిస్తూ హుజూరాబాద్ ప్రజల కన్నుగప్పాలని చూస్తున్నారు. గెలుపు గగనకుసుమం అని తెలిసిపోయిందో ఏమో.. ఇక ప్రజలను మభ్యపెట్టి పబ్బం గడుపుదామని భావిస్తున్నట్టున్నారు. పచ్చి అబద్ధాలతో, అసత్య ప్రచారంతో తనకు రెండు నాలుకలు ఉన్నాయని మరోసారి రుజువు చేసుకుంటున్నారు. ఎక్కడ చీమ చిటుక్కుమన్నా కంగారు పడిపోయి కహానీలు అల్లేస్తున్నారు. అడ్డగోలుగా మాట్లాడుతూ అడ్డంగా దొరికిపోతున్నారు. హుజూరాబాద్ ఉపఎన్నికలో బీజేపీ అలవాటులో భాగంగా అబద్ధాల ప్రచారాలు, మోసపు మాటలతో గెలిచే ప్రయత్నం చేస్తున్నది. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్, తప్పుడు ప్రచారంలో ఆరితేరిన ఆ పార్టీ నేతలు ఇప్పుడు నిత్యం ఇదేపనిలో నిమగ్నమతున్నారు. ప్రజల సంక్షేమం, నియోజకవర్గ అభివృద్ధి, రాజకీయ విధానాలు, హామీలు వంటి వాటిని పక్కన పెట్టిన బీజేపీ నేతలు.. చావులను, బతుకులను, కరెంటు సరఫరాను, గ్యాస్ ధరలను రాజకీయానికి వాడుకుంటున్నారు. బీజేపీ అభ్యర్థి ఈటల గతంలో చెప్పిన మాటలు, ఇప్పటి మాటలకు పొంతన లేకుండా ఉండడంతో ప్రజలు ఇదేంటని అనుకుంటున్నారు. రాజకీయాల కోసం ఇంతగా దిగజారిపోతారా? అని అవాక్కవుతున్నారు. హుజూరాబాద్ ఎన్నికల ప్రచారంలో ఇటీవల పలు అంశాలపై బీజేపీ అభ్యర్థి ఈటల చేస్తున్న చిత్రవిచిత్ర రాజకీయ విన్యాసాలు అందరికీ నవ్వును తెప్పిస్తున్నాయి.
ప్రమాదంలో ఆటో డ్రైవర్ మృతిపై అవాకులూ చవాకులూ
సోమవారం కమలాపూర్ మండలం ఉప్పల్ భీంపల్లి క్రాస్ వద్ద కారు, ఆటో ఢీకొనడంతో ఆటో డ్రైవర్ నాగుర్ల రాజేందర్ చనిపోయాడు. సమాచారం అందగానే పోలీసులు వచ్చి తక్షణ చర్యలు చేపట్టారు. ఉపఎన్నికలు కావడంతో ఈటల రాజేందర్ కొందరు బీజేపీ నేతలను వెంటపెట్టుకుని అక్కడికి వచ్చి హడావుడి చేశారు. టీఆర్ఎస్కు చెందినవారి కారు ఢీకొనడంతోనే ఆటోడ్రైవర్ నాగరాజు చనిపోయాడని ఆరోపించారు. ఆటో డ్రైవర్ కుటుంబానికి న్యాయం చేయాలని రాత్రి పదిగంటల వరకు అక్కడ హంగామా చేశారు. ‘ప్రమాదానికి కారణమైన కారు ఇక్కడే తిరుగుతున్నది. అతివేగంతో ప్రయాణిస్తున్న ఆ కారులో డబ్బుసంచులు ఉన్నయి. కారు యజమానిని, డ్రైవర్‌ను కాపాడాలనే డబ్బులను వేరే కార్లలో తరలించారు’ అని ఈటల మాటలు విసిరారు. డ్రైవర్ చావుకు కారణమైనవారు రూ.30 లక్షల పరిహారం ఇవ్వాలని కూడా డిమాండ్ చేశారు.
అసలు నిజం
ఈ సంఘటనకు సంబంధించిన వాస్తవం వేరేలా ఉన్నది. ప్రమాదానికి కారణమైన కారు యజమాని విశ్వనాథ వినోద్. కరీంనగర్‌కు చెందిన ఈయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దగ్గరి మిత్రుడు. బీజేపీ ముఖ్యనేతల దగ్గరి మిత్రుడి కారులో బీజేపీ వాళ్లు డబ్బులు పంపారా? ప్రమాదం జరుగడంతో నెపం టీఆర్ఎస్మీదకు తోసేయాలని చూస్తున్నారా? లేక బీజేపీ వాళ్లు కావాలనే ఆటోను కారుతో గుద్దించి, టీఆర్ఎస్పై ఆరోపణలు చేసి ఓట్లు దండుకోవాలని చూస్తున్నారా? అని హుజూరాబాద్ ప్రజలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
లేని కరెంటు కట్ అయ్యిందట.. కావాలని చేశారట
హుజూరాబాద్ ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా రాజేందర్ ఈ నెల 3న జమ్మికుంటలోని శంకరనందన గార్డెన్స్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం కరెంటు కట్ చేసి తన ప్రచారానికి అడ్డు తగులుతున్నదని చెప్పుకొచ్చారు. ఉపఎన్నికలో అధికార దుర్వినియోగం చేస్తున్నారని మంత్రి హరీశ్‌రావుపై అలవోకగా ఆరోపణ చేశారు.
అసలు నిజం
ఈ సంఘటనలోనూ వాస్తవం వేరే ఉన్నది. జమ్మికుంటలోని శంకరనందర గార్డెన్స్ ఆరునెలలుగా కరెంటు బిల్లు సరిగా చెల్లించడంలేదు. రూ.66,226 బిల్లు పెండింగ్‌లో ఉండడంతో మూడునెలల క్రితం ఎన్పీడీసీఎల్ ఈ ఫంక్షన్‌హాల్‌ను అండర్ డిస్ కనెక్ట్ (యూసీడీ) క్యాటగిరీలో చేర్చింది. కరెంటు సరఫరాను నిలిపివేసింది. అప్పటి నుంచి ఈ ఫంక్షన్హాల్లో ఏ కార్యక్రమం జరిగినా డీజిల్ జనరేటర్‌నే ఉపయోగిస్తున్నారు. డీజిల్ అయిపోవడం వల్లనో, జనరేటర్ సాంకేతిక లోపం కారణంగానో ఈటల కార్యక్రమంలో మైక్ బంద్ అయ్యింది. వాస్తవం తెలియకో, తెలిసినా రాజకీయ లాభం కోసమో ఈటల అబద్ధాలాడి అభాసు పాలయ్యారు.
వంటగ్యాస్ ధరపై అబద్ధాల మంట
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వంటగ్యాస్, పెట్రోలు, డీజిల్ ధరలను అడ్డగోలుగా పెంచుతున్నది. క్రమం తప్పకుండా ప్రతినెలా, అప్పుడప్పుడు వారానికోసారి అదనపు వడ్డింపులతో ప్రజల నడ్డి విరగ్గొడుతున్నది. వంటగ్యాస్ సిలిండర్ ధర ఇప్పుడు రూ.956కు చేరింది. లీటరు పెట్రోలు రూ.108.96, డీజిల్ వంద దాటేసింది. సబ్సిడీలను పెంచే దిశగా బీజేపీ ప్రభుత్వం ఎలాంటి ఆలోచనలు చేయడంలేదు. దీంతో పెట్రో ఉత్పత్తుల ధరలు సామాన్యులకు భారంగా మారాయి. కేంద్రం తీరుపై పేదలు, మధ్యతరగతి ప్రజలు మండిపడుతున్నారు. హుజూరాబాద్ ఉపఎన్నికలో ఈటల దీనిపైనా అబద్ధాలే మాట్లాడుతున్నారు. గ్యాస్ సిలిండర్‌పై రాష్ట్ర ప్రభుత్వం రూ.291 వసూలు చేస్తున్నదని, అందుకే ధరలు పెరుగుతున్నాయని ఆరోపణలు చేస్తున్నారు.
అసలు నిజం
వాస్తవం ఏమిటంటే.. గ్యాస్ సిలిండర్‌పై కేంద్రం 5శాతం జీఎస్టీ విధిస్తున్నది. అందులో సీజీఎస్టీ 2.5శాతం, ఎస్జీఎస్టీ (రాష్ట్ర పన్ను) 2.5 శాతం మాత్రమే. పెట్రోలు, డీజిల్‌పైనా ఇదే పరిస్థితి. ఈటల రాజేందర్ 2014 నుంచి 2018 వరకు టీఆర్ఎస్ ప్రభుత్వంలో పౌరసరఫరాల మంత్రిగా పనిచేశారు. సిలిండర్, గ్యాస్, పెట్రోలు, కిరోసిన్ వంటి ధరలు కేంద్రమే నిర్ణయిస్తుందన్న సంగతి ఈటలకు తెలియదా? తెలిసినా రాజకీయ లబ్ధి కోసం ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారా?