కరీంనగర్, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ)/రాయికల్ : బీఆర్ఎస్ చేపట్టిన గురుకుల బాటకు పోలీసులు అడ్డంకులు సృష్టించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌లో గురుకుల బాటకు బయలుదేరగా పోలీసులు పెద్ద సంఖ్యలో వచ్చి చుట్టుముట్టారు. వివరాలు ఇలా.. కరీంనగర్‌లోని శ్రీపురం కాలనీలోని తన నివాసం నుంచి శనివారం ఉదయం మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ బయలుదేరారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని రుక్మాపూర్, చొప్పదండి పట్టణం, మల్లాపూర్, అల్లీపూర్, ధర్మపురి తదితర గురుకుల పాఠశాలల్లో పరిస్థితిని తెలుసుకునేందుకు ఆయన సుంకె రవిశంకర్‌తో కలిసి షెడ్యూల్ నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా కొప్పుల ఈశ్వర్ చొప్పదండి మండలం రుక్మాపూర్‌లో సుంకె రవిశంకర్‌ను కలుసుకుని స్థానికంగా ఉన్న ఒక గురుకులాన్ని పరిశీలించాలి. అప్పటికే చొప్పదండి మండలం రుక్మాపూర్ చేరుకున్న సుంకె రవిశంకర్ స్థానిక మాజీ సర్పంచ్ శ్రీనివాస్‌రెడ్డి ఇంట్లో టీ తాగుతుండగా సుమారు 100 మంది పోలీసులు చుట్టుముట్టారు. రవిశంకర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
అదే సమయంలో తన నివాసం నుంచి బయలుదేరి కరీంనగర్ మండలం నగునూర్ వరకు వచ్చిన కొప్పుల ఈశ్వర్‌కు సుంకె అరెస్ట్ విషయం తెలియడంతో మరో మార్గంలో మల్లాపూర్ వెళ్లేందుకు ప్రయత్నించారు. విషయం తెలిసి పోలీసు వాహనాలు ఆయన కాన్వాయిని వెంబడించాయి. కరీంనగర్ సమీపంలోని తీగలగుట్టపల్లికి చేరుకోగానే ఓవర్టేక్ చేసి అడ్డుకున్నారు. సీపీ అనుమతితో పోలీసులు కొప్పులను శ్రీపురంకాలనీలోని తన ఇంటికి తీసుకువచ్చి గృహ నిర్బంధం చేశారు. కాగా, రుక్మాపూర్‌లో మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ను అరెస్టు చేసిన పోలీసులు రామడుగు పోలీసు స్టేషన్‌కు తరలించి, మధ్యాహ్నం 3 వరకు నిర్బంధించారు. ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పోలీసు స్టేషన్‌కు వచ్చి రవిశంకర్‌కు సంఘీభావం తెలిపారు.
అల్లీపూర్ గురుకులం ఎదుట ధర్నా
జగిత్యాల జిల్లా రాయకల్ మండలం అల్లీపూర్ బీసీ సంక్షేమ గురుకుల పాఠశాల సందర్శన కోసం వెళ్లగా పాఠశాల సిబ్బంది గేట్లకు తాళం వేసి ఆవరణలోకి రానివ్వకపోవడంతో బీఆర్ఎస్ నాయకులు ధర్నాకు దిగారు. జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంతతోపాటు నాయకులు పాఠశాల ఎదుట కూర్చుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. అనంతరం ప్రహరీ పక్కన చిన్న దారి నుంచి లోపలికి వెళ్లి విద్యార్థులకు అందుతున్న వసతులు, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి, సమస్యలు అడిగి తెలుసుకున్నారు.