ఆదిలాబాద్: కాంగ్రెస్ పాలనలో రైతుల కష్టాలు రోజురోజుకు అధికమవుతున్నాయి. విత్తనాల కోసం రైతన్నలు (Farmers) అష్టకష్టాలు పడుతున్నారు. ఉదయం నుంచే ఫర్టిలైజర్ షాపుల మందు క్యలైన్లలో వేచిఉంటున్నారు. అయినా విత్తనాలు దొరక్కపోవడంతో ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. అధికారులు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. డిమాండ్ మేర విత్తనాలు సరఫరా చేయడం లేదని, వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
అదిలాబాద్ జిల్లాలో (Adilabad) పత్తి విత్తనాల కొరత రైతులును వేధిస్తుంది. రాశి-2 పత్తి విత్తనాల కోసం రైతులు వారం రోజులుగా పడి గాపులు కాస్తున్నారు. మంగళవారం విత్తనాలు రావడంతో రైతులు విత్తన దుకాణాల వద్ద బారులు తీరారు. ఉదయం 7 గంటల నుంచి ఆదిలాబాద్‌లోని దుకాణాల ముందు క్యూ కట్టారు. రైతులు విత్తనాల కోసం అధిక సంఖ్యలో తరలి రావడంతో పోలీసులు పంపిణీ కేంద్రాలకు చేరుకొని విత్తనాల పంపిణీ పరిశీలిస్తున్నారు.
పోలీసు బందోబస్తు మధ్య వ్యాపారులు రైతులకు విత్తనాలు పంపిణీ చేస్తున్నారు. ఒక్కో రైతుకు రెండు ప్యాకెట్లు మాత్రమే ఇస్తున్నారు. తమకు అవసరమైన విత్తనాలు సరఫరా చేయడం లేదని కేవలం రెండు బ్యాగులు మాత్రమే ఇస్తున్నారు అంట రైతుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, పెద్ద సంఖ్యలో రైతులు తరలిరావడంతో గందరగోళం ఏర్పడింది. దీంతో పోలీసులు, రైతులకు మధ్య తోపులాట చోటుచేసుకున్నది. అన్నదాతలపై పోలీసులు లాఠీచార్జీ చేశారు.
కాగా, జగిత్యాల జిల్లా మెట్పల్లిలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతున్నది. మెట్పల్లి వ్యవసాయ కార్యాలయం వద్ద జీలుగు, జనుము విత్తనాల కోసం రైతులు బారులు తీరారు. మూడు కేంద్రాల్లో రైతులకు వెయ్యి బస్తాల విత్తనాలు మాత్రమే పంపిణీ చేస్తున్నారు. మరో 2500 బస్తాల విత్తనాలు అవసరం ఉంటుందని తెలిపారు.