హైదరాబాద్ సిటీబ్యూరో, మే 20 (నమస్తే తెలంగాణ): పోక్సో కేసులో బండి భగీరథ్‌పై మరో సెక్షన్‌ను పోలీసులు అదనంగా నమోదు చేశారు. కీలక ఆధారాలు మాయం చేసినందుకుగాను తాజాగా 238 సెక్షన్‌ను అదనంగా జోడించారు. డిజిటల్ ఆధారాలను తొలగించడంతోపాటు గతంలో వాడిన ఫోన్లు, సిమ్‌కార్డులు, ఇతర ముఖ్య ఆధారాలను నిందితుడు బండి భగీరథ్ మాయంచేసినట్టు తెలిసింది. ఈ విషయాన్ని పోలీసులు తమ విచారణలో నిర్ధారించినట్టు సమాచారం. పథకం ప్రకారం కీలక ఆధారాలన్నీ రూపుమాపిన తర్వాతే పోలీసులకు లొంగిపోయాడనే వాదనలు పోలీస్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. మైనర్ బాలికపై లైంగిక వేధింపుల ఆరోపణలతో బండి భగీరథ్‌పై పోక్సో కేసు నమోదైన తొలిరోజు నుంచి ఈ కేసులో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు ఎదురవుతున్నాయి. బండి ఉదంతంలో పోలీసులు మొదట తీవ్రత లేని బీఎన్ఎస్ 74, 75 సెక్షన్లతో పాటు పోక్సో చట్టం 11 రెడ్‌విత్ 12 కింద కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
ఆయా సెక్షన్ల ప్రకారం నిందితుడికి ఏడేండ్లలోపు శిక్ష పడే అవకాశం ఉండటంతో అరెస్టు చేసే అవకాశం కూడా లేకుండాపోయింది. దీంతో ఎలాగైనా మచ్చలేకుండా బయట పడొచ్చని భగీరథ్ భావించాడు. అయితే ప్రత్యేక దర్యాప్తు అధికారిగా నియమితులైన డీసీపీ రితిరాజ్ ఈనెల 12న పోక్సో కేసులో తీవ్రమైన నేరాల కింద సెక్షన్5(1), రెడ్‌విత్ 6సెక్షన్లను జోడించడంతోపాటు 13న పోలీస్ విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు జారీచేశారు. ఆయా సెక్షన్లతో నిందితుడికి బెయిల్ కూడా మంజూరు కాని పరిస్థితి ఎదురైంది. ఇదిలా ఉండగా, మే 13న పోలీస్ విచారణకు హాజరు కాని భగీరథ్.. తనకు రెండు రోజుల గడువు ఇవ్వాలని అభ్యర్థిస్తూ పోలీసులకు మెయిల్ ద్వారా సమాచారం పంపించి అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బాధితురాలు ఫిర్యాదు చేసిన మే 8 నుంచి 16 వరకు 9రోజులపాటు అజ్ఞాతంలో ఉన్న నిందితుడు నిపుణుల సూచనల మేరకు న్యాయపరమైన కీలక అంశాలపై వర్కౌట్ చేసినట్టు తెలుస్తున్నది.
భగీరథ్ స్నేహితుల కోసం గాలింపు
బండి భగీరథ్‌పై పోక్సో కేసు నమోదైనప్పటి నుంచి అతడికి అత్యంత సన్నిహితంగా ఉండే స్నేహితుల్లో కొందరు అజ్ఞాతంలోకి వెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. వారు దేశంలోనే ఉన్నారా? లేక దేశం విడిచి బయటకు వెళ్లారా? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నట్టు తెలిసింది. ఈ క్రమంలో వారి కోసం పోలీస్ బృందాలు గాలింపు చర్యలను ముమ్మరం చేసినట్టు తెలుస్తున్నది.
పోక్సో కేసుపై బండి దాటవేత ; కోర్టు పరిధిలో ఉన్నదంటూ తప్పించుకున్న కేంద్ర మంత్రి
బండి భగీరథ్ పోక్సో కేసులో తన అరెస్ట్ తప్పదంటూ జరుగుతున్న ప్రచారంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సమాధానాన్ని దాటవేశారు. ‘ఈ కేసులో మిమ్మల్ని అరెస్ట్ చేస్తారంటూ వార్తలొస్తున్నాయి కదా?’ అని ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించగా, ఆ అంశం కోర్టు పరిధిలో ఉన్నదంటూ దాటవేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కన్నకొడుకును ఓ తండ్రి పోలీసులకు స్వయంగా అప్పగించిన సందర్భం ఏనాడైనా ఉన్నదా? అని బండి సంజయ్ ప్రశ్నించారు. కొత్త పార్టీ పెట్టాలనే ఆలోచన తనకు లేదని, మీడియాలో వస్తున్న కథనాలన్నీ ఫేక్ అని కొట్టి పారేశారు. తనను బర్తరఫ్ చేయాలనే డిమాండ్‌పై బండి స్పందిస్తూ.. కొన్ని పార్టీలు కావాలనే అలాంటి దుష్ప్రచారం చేస్తున్నాయని పేర్కొన్నారు.