నయీంనగర్(హన్మకొండ), జనవరి16 : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన జనగామ, యాదాద్రి జిల్లాల్లో భూ భారతి రిజిస్ట్రేషన్లలో అవినీతి అక్రమాల కేసును పోలీసులు ఛేదించారు. రిజిస్ట్రేషన్లకు సంబంధించి రూ.3.90 కోట్ల కుంభకోణంలో ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టిన ముఠాలోని15 మందిని జనగామ పోలీసులు అరెస్టు చేయగా, మరో తొమ్మిది మంది పరారీలో ఉన్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు శుక్రవారం వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్ హనుమకొండలోని కార్యాలయంలో వెల్లడించారు. సీపీ కథనం ప్రకారం.. ప్రధాన నిందితులు పసునూరి బసవరాజు, జెల్లా పాండు యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో ఆన్లైన్ సర్వీస్‌సెంటర్ నిర్వహిస్తున్నారు.
గణేశ్ అనే వ్యక్తి ఆన్లైన్ సెంటర్లతో పరిచయం చేసుకొని ప్రభుత్వానికి చెల్లించాల్సిన మొత్తాన్ని ఎన్ఆర్ఐ ఖాతా పే చేస్తానని చెప్పి రైతుల నుంచి డబ్బులు వసూలు చేసి, వాటిని ఆన్లైన్ సర్వీస్ వ్యక్తులు, మధ్యవర్తులకు కమీషన్ చొప్పున అందజేస్తూ, ఈ చలాన్లు ప్రధాన నిందితుడికి పంపేవాడు. వచ్చిన చలాన్లను బసవరాజు భూ భారతి వెబ్సైట్లో ఇన్స్పెక్ట్ ఎడిట్ అప్లికేషన్‌ను ఉపయోగించి రుసుమును తగ్గించి చలాన్‌ను మొబైల్ ద్వారా ఎడిట్ చేసి తిరిగి రైతులకు పంపేవాడు. ఈ క్రమంలోనే నిందితులు మొబైల్ ఆప్లికేషన్తో ప్రభుత్వానికి పే చేసే రుసుమును రసీదులో కంటే తక్కువగా చెల్లించేవారు. తర్వాత ఆ నకిలీ చలాన్లనే మధ్యవర్తుల ద్వారా ఎంఆర్వో, రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో సమర్పించి, ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ మోసాలకు పాల్పడేవారు. ఇలా ప్రధాననిందితులిద్దరు జనగామ, యాద్రాద్రి జిల్లాల్లో 1,080 పత్రాలకు సంబంధించిన లావాదేవిల్లో మోసాలకు పాల్పడగా 22 కేసులు నమోదైనట్టు సీపీ వెల్లడించారు.
నిందితుల వివరాలు
కేసులో మొత్తంగా 15 మందిని అరెస్ట్ చేసినట్టు సీపీ తెలిపారు. అరెస్ట్ అయిన వారిలో యాదాద్రి జిల్లాకు చెందిన గణేశ్‌కుమార్, కిషన్‌రెడ్డి, దశరథ, భానుప్రసాద్, శ్రీనాథ్, శివకుమార్, అమంగల్, నాగరాజు, కరుణాకర్, కమల్ సహా జనగామ జిల్లాకు చెందిన శ్రీనాథ్, యెనగందుల వెంకటేశ్, కోదూరి శ్రావణ్, కొలిపాక సతీశ్‌కుమార్, తడూరి రంజిత్ కుమార్ ఉన్నట్టు సీపీ తెలిపారు. ఈ సందర్భంగా వారి నుంచి రూ.63.19 లక్షల నగదు, బ్యాంకులో రూ.లక్ష, సుమారు కోటి రూపాయల విలువైన ఆస్తిపత్రాలు, కారు, రెండు ల్యాప్‌టాప్‌లు, ఐదు డెస్టాప్లు, 17 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు సీపీ వివరించారు.