నిర్మల్ అర్బన్, మార్చి 26: నిర్మల్ మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. మార్చి 21న మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి నిర్మల్ మున్సిపాలిటీలోని 42 ఉద్యోగాలు అమ్ముకున్నారని ఆరోపణలు చేశారు. దీనిపై బీఆర్ఎస్ పార్టీ నిర్మల్ పట్టణ అధ్యక్షుడు మారకొండ రాము ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ కేసులో నోటీసును అందజేయడానికి దర్యాప్తు బృందం మహేశ్వర్‌రెడ్డి ఇంటికి వెళ్లగా ఆయన అందుబాటులో లేరు. దీంతో నోటీసును ఇంటి గోడకు అంటించారు. ఇందులో మహేశ్వర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలకు తన వద్ద ఏవైనా సాక్ష్యాధారాలు ఉంటే విచారణాధికారి గంగాధర్ వద్ద మంగళవారం ఉదయం హాజరుకావాలని, దర్యాప్తునకు సహకరించాలని పేర్కొన్నారు.