ఊట్కూర్ (మాగనూర్), నవంబర్ 28 : నారాయణపేట జిల్లా మాగనూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పోలీస్ పహారాలోనే కొనసాగుతున్నది. హైకోర్టు ఆదేశాలతో అప్రమత్తమైన అధికారులు గురువారం పాఠశాలలోకి మీడియాను పూర్తిగా నిషేధించారు. బయటి వ్యక్తులు పాఠశాలలోకి వెళ్లకుండా మెయిన్ గేట్ వద్ద కాపలా ఉన్నారు. గురువారం చేసిన వంటలను మీడియా కంటపడకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. మహిళా సంఘాలకు చెందిన ముగ్గురు మహిళలతోపాటు పాఠశాల సిబ్బందితో వంటలు చేయించారు.
అన్నం, క్యారెట్, ఆలుగడ్డతో తయారు చేసిన పప్పు, సాంబారును వడ్డించారు. కాగా, పాఠశాలలో 590 మంది విద్యార్థులు ఉండగా.. కేవలం 270 మంది మాత్రమే హాజరయ్యారు. వారిలో కూడా సగం మంది ఇంటి నుంచే టిఫిన్ బాక్సులు తెచ్చుకున్నారు. పాఠశాలను తెలంగాణ మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద తనిఖీ చేశారు. ఫుడ్ పాయిజన్‌కు గురైన విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. అధికారులు, ఉపాధ్యాయులతో సమావేశమై కారణాలు తెలుసుకున్నారు. కిచెన్, స్టోర్‌రూం, వాష్ రూంలను పరిశీలించారు.
పదోతరగతి విద్యార్థులతో సమావేశం కాగా, ఉడికీ ఉడకని కూరగాయలతోపాటు పురుగుల అన్నం వడ్డిస్తున్నారని, వాష్‌రూంలు శుభ్రం చేయకపోవడంతో దుర్వాసన వస్తున్నదని, రోజూ కలుషితమైన నీటినే తాగుతున్నామని విద్యార్థులు ఫిర్యాదు చేశారు. తాము చిరుతిండ్లు తినలేదని పేర్కొన్నారు. అధికారుల ఆరోపణలన్నీ అబద్ధమని తెలిపారు. అధికారులు దగ్గరుండి విద్యార్థులకు వసతులు కల్పించాలని చైర్పర్సన్ ఆదేశించారు. రాజకీయాలతో సంబంధం లేకుండా నాణ్యమైన భోజనం వడ్డించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. కాగా, పాఠశాల బయట ఉన్న దుకాణాల్లోనూ సోదాలు జరిపారు.