గన్నేరువరం, ఆగస్టు 30: బీఆర్ఎస్ సర్కార్ మంజూరు చేసిన డబుల్ రోడ్డును నిర్మించాలని డిమాండ్ చేస్తూ గన్నేరువరంలో యువకులు చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేయడం ఉద్రిక్తతకు దారితీసింది. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గుండ్లపల్లి నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పొత్తూరు వరకు బీఆర్ఎస్ సర్కార్ డబుల్ రోడ్డు మంజూరు చేసింది. ఈ రోడ్డు పనులు చేపట్టడంలో కాంగ్రెస్ ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రతిపక్షాలు, స్థానిక యువకులు అనేకసార్లు ఆందోళనలు చేపట్టారు.
ఆదివారం పెద్ద సంఖ్యలో గన్నేరువరం చేరుకుని దీక్షకు పూనుకున్నారు. పోలీసులు వచ్చి అనుమతి లేదంటూ దీక్షలో కూర్చున్న యువకులను అడ్డుకున్నారు. బలవంతంగా అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా తీవ్ర తోపులాట జరుగడంతో పలువురికి గాయాలయ్యాయి. అరెస్టు చేసిన వారిని చిగురుమామిడి ఠాణాకు తరలించారు. ఈ సందర్భంగా యువజన సంఘాల అధ్యక్షుడు కాలువ నాగరాజు, మాజీ జడ్పీటీసీ మాడుగుల రవీందర్ రెడ్డి, యువజన కాంగ్రెస్ నాయకుడు అల్లూరి శ్రీనాథ్‌రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గంప వెంకన్న మాట్లాడుతూ.. రోడ్డు వేయడం చేతగాని ఎమ్మెల్యే కవ్వంపల్లి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
యువకుల దీక్షను భగ్నం చేయడం, వారిని అరెస్టు చేయడాన్ని మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తీవ్రంగా ఖండించారు. తమ ప్రభుత్వ హయాంలోనే ఈ రోడ్డుకు రూ.72 కోట్లు మంజూరు చేయించానని, 3 కిలో మీటర్ల వరకు రోడ్డు నిర్మాణం కూడా అయ్యిందని చెప్పారు. కాంట్రాక్టర్‌కు పెండింగ్ బిల్లులు చెల్లిస్తే రోడ్డు పనులు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాడని, కానీ ఈ బిల్లులు ఇప్పించేందుకు ఎమ్మెల్యే కవ్వంపల్లికి చేతకావడం లేదని విమర్శించారు.
గన్నేరువరంలో యువజన సంఘాల నిరాహార దీక్షలో పాల్గొన్నందుకు యువజన కాంగ్రెస్ నాయకుడు అల్లూరి శ్రీనాథ్‌రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ సందర్భంగా శ్రీనాథ్‌రెడ్డి మాట్లాడుతూ.. యువజన సంఘాల ఆధ్వర్యంలో దీక్షకు కూర్చుంటే పార్టీ నుంచి ఎలా సస్పెండ్ చేస్తారని ప్రశ్నించారు.