ఏ నాయకుడైనా సాధారణంగా ఏం చేస్తాడు? తాను చేసిన పనుల గురించి ప్రజలకు చెప్పుకొంటాడు. కానీ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిలో అలాంటి ఆత్మవిశ్వాసం లోపించినట్టుంది! వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకున్న తర్వాత కూడా, ప్రతిపక్షం మీద దాడికే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. సాధారణంగా ప్రధాన ప్రతిపక్షనేత ఎంత మౌనంగా ఉంటే అధికార పక్షం అంత సంతోషంగా ఉండాలి. కానీ, తెలంగాణలో అందుకు భిన్నమైన రాజకీయ వాతావరణం నెలకొన్నది! నిజానికి కేసీఆర్ మౌనంగా ఉంటున్నారనడం కంటే ఓర్పు, సహనం పాటిస్తున్నారనడమే సబబుగా ఉంటుంది. తెలంగాణ ఉద్యమ కాలంలో ఉద్యమ నేతగా కేసీఆర్ ప్రయోగించిన భాష వేరు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా అధికారిక కార్యక్రమాల్లో మాట్లాడిన తీరు వేరు. ఇప్పుడు ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తున్న తీరు వేరు.
రేవంత్‌రెడ్డి ఎంతగా రెచ్చగొడుతున్నా, తన హోదాను మరచి ఎన్ని దుర్భాషలాడుతున్నా కేసీఆర్ సంయమనం ప్రదర్శిస్తున్నారు. టీవీ కెమెరాలు కనబడితే చాలు పూనకాలు వచ్చినట్టు ఊగిపోయే ఈతరం నేతలు కేసీఆర్ నుంచి నేర్చుకోవాల్సిన సులక్షణమిది. తన ఇమేజ్ను దెబ్బతీసేందుకు అధికార పక్షం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, ఆయన సహనం కోల్పోవడం లేదు. సుదీర్ఘ రాజకీయ అనుభవం నేర్పిన రాజనీతిజ్ఞత ఇందుకు కారణం కావొచ్చు. మరోవైపు, చేతిలో అధికారం ఉన్నప్పటికీ ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ఇటు తన మంత్రివర్గం మీద, అటు అధికార యంత్రాంగం మీద పట్టు సాధించలేకపోయారని, తన వ్యవహార శైలి పట్ల పార్టీ ఎమ్మెల్యేల్లో అసమ్మతి, పాలన పట్ల అన్ని వర్గాల ప్రజల్లో అసంతృప్తి పెరుగుతున్నది. దీంతో సీఎం రేవంత్‌రెడ్డి తీవ్రమైన ఫ్రస్ట్రేషన్‌కు లోనవుతున్నారని, అందుకే భాష అదుపుతప్పున్నదనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.
ఇప్పటికే రైతుభరోసా, యూరియా సరఫరా, ఫీజు రీయింబర్స్మెంట్, ఉద్యోగుల, నిరుద్యోగుల సమస్యలు, వర్షాభావ పరిస్థితులు, సాగు, తాగునీటి కొరత ప్రజలకు తీవ్రంగా ఇబ్బందులు కలిగిస్తున్నాయి. ఆయా సమస్యలను పరిష్కరించడంలో రేవంత్‌రెడ్డి విఫలమయ్యారనే విమర్శలకుతోడు 22ఏ నిషేధిత భూముల వివాదం సర్కార్ పనితీరుకు మరో మైనస్ పాయింట్‌గా మారింది.
ఆయా సమస్యలపై అసెంబ్లీలో చర్చించి, వాటికి పరిష్కారాలు వెదకడం కంటే ప్రధాన ప్రతిపక్షాన్ని సభలో రాకుండా నిరోధించడం మీదనే రేవంత్‌రెడ్డి ఎక్కువ దృష్టి పెట్టినట్టు కనబడుతున్నది. తొలి రోజు అసెంబ్లీగేటు వద్ద జరిగిన పరిణామాలు ఇందుకు నిదర్శనం. తమ పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై మహిళా ఎమ్మెల్యేలు జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేయడంతో అసెంబ్లీ ఘటనలు జాతీయ స్థాయి వ్యవహారంగా మారాయి. కేసీఆర్ చావును కోరుకుంటున్నామని కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ వ్యాఖ్యానించడం, కాంగ్రెస్ కార్యకర్తలు ఎర్రవల్లిలో కేసీఆర్ నివాసానికి వెళ్లేదారిలో చావుడప్పు కొట్టడం వంటి పరిణామాలు రాజకీయాలు ఎటువైపు వెళ్తున్నాయనే ఆందోళనను రేకెత్తించాయి.
ఈ నేపథ్యంలోనే కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో అసైన్డ్ భూములు ఉన్నాయని ఆరోపిస్తూ విచారణకు ఆదేశిస్తున్నట్టు రేవంత్‌రెడ్డి ప్రకటించడంతో ఈ వ్యవహారం మరో మలుపు తిరిగింది. ఎర్రవల్లికి వెళ్లి రెవెన్యూ అధికారులు రికార్డుల పరిశీలన చేస్తున్న సమయంలోనే, కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బస్సుల్లో బయలుదేరి బీఆర్ఎస్ కీలక నేతలు హరీశ్‌రావు, కేటీఆర్ భూముల వైపు వెళ్లడం రాజకీయ ఉద్రిక్తతలు సృష్టించింది. తన చుట్టూ, తన కుటుంబం చుట్టూ ఇంత జరుగుతున్నా కేసీఆర్ నిబ్బరంగానే వ్యవహరిస్తుండటం విశేషం. దాదాపు వారం, పదిరోజులపాటు సాగిన ఈ ఎపిసోడ్లో చివరికి రేవంత్‌రెడ్డి సాధించిందేమిటి?
స్వయంగా ముఖ్యమంత్రే గ్రామాల్లో బీఆర్ఎస్ దిమ్మెలను కూల్చేయాలని రెచ్చగొట్టేలా మాట్లాడటం, ప్రధాన ప్రతిపక్ష నేత రాజీనామాకు డిమాండ్ చేయడం, ఆయన చావును కోరుకుంటూ ఒకటికి నాలుగుసార్లు వ్యాఖ్యలు చేయడం, చావుడప్పులు మోగించడం, ఫామ్‌హౌస్‌ల పరిశీలన పేరిట ప్రతిపక్ష నేతలకు చెందిన ప్రైవేట్ ఆస్తుల వద్దకు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు వెళ్లడం, ప్రధాన ప్రతిపక్షాన్ని సెషన్ మొత్తానికే సస్పెండ్ చేసి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడం, అసెంబ్లీ గేటు వద్ద ఘటనలను ఆసరాగా చేసుకుని ప్రతిపక్ష శాసనసభ్యుల మీద కేసులుపెట్టిన పోలీస్ కానిస్టేబుల్‌ను పిలిచి స్పీకర్ సన్మానించడం ఇవన్నీ దేనికి సంకేతాలు?
రాష్ట్ర రాజకీయాల్లో ఏ విధమైన సంస్కృతిని చొప్పించదల్చుకుంటున్నారు? రూ.లక్షల కోట్ల అవినీతి అంటూ తాము చేసిన ఆరోపణలను రుజువు చేయలేకనే అధికార పక్షం ఇలాంటి రాజకీయ షోలు నడుపుతున్నదా? వర్షాభావ పరిస్థితులు, సాగునీటి కొరత, 22ఏ నిషేధిత జాబితా వ్యవహారం తదితర సమస్యలకు తక్షణ పరిష్కారం చూపించలేక ఉద్దేశపూర్వకంగానే ఉద్రిక్తతలు సృష్టిస్తున్నదా? అనే అనుమానం కలుగుతున్నది. రాష్ట్రస్థాయి రాజకీయ నేతల వ్యవహార శైలినే ఆదర్శంగా తీసుకొని రేపు గ్రామ స్థాయి నేతలు కూడా తమ ప్రత్యర్థుల విషయంలో ఇలాంటి దుందుడుకు చర్యలకు దిగితే పరిస్థితి ఏమిటి? ఏదైనా జరుగరానిదే జరిగితే ఎవరు బాధ్యులు?
– కందిబండ కృష్ణప్రసాద్ 9182777010