కరీంనగర్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ)/హుజూరాబాద్: దళితుల కోసం ధర్నాకు దిగిన హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై పోలీసులు దాడికి దిగారు. లాఠీలు పట్టుకోకుండా చర్మం వడిపెడుతూ, పక్కటెముకలపై పిడిగుద్దులు గుద్దారు. దీంతో ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి సొమ్మసిల్లి పడిపోయారు. దళితులే ముందుండి పోలీసు వాహనంలో హుజూరాబాద్ ఏరియా దవాఖానకు తరలించి ప్రాథమిక చికిత్స చేయించారు. అనంతరం కరీంనగర్ అపోలో రీచ్‌కు తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. రెండో విడత దళితబంధు కోసం రోడ్డెక్కిన దళితులపైనా, వారికి మద్దతుగా నిలిచిన ఎమ్మెల్యేపైనా పోలీసులు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దొరికిన వారిని దొరికినట్టు తాడుతో లాగుతూ కింద పడేస్తూ కాళ్లతో తన్నడం, చేతులు పట్టి కింద పడేలా విసిరేయడం వంటి చర్యలకు పాల్పడ్డారు. ఈ సంద్భంగా ఒక మహిళ సహా నలుగురు గాయపడ్డారు. దాదాపు రెండు గంటలపాటు హుజూరాబాద్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది. పోలీసులతో తనను హత్య చేయించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి కుట్ర చేస్తున్నారని ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి తీవ్రంగా విరుచుకుపడ్డారు. పోలీసుల దాడిలో గాయపడిన దళితులను మాజీ మంత్రి గంగుల కమలాకర్ పరామర్శించారు.
రెండో విడుత దళితబంధు కోసం హుజూరాబాద్ నియోజకవర్గంలోని దళితులు పది నెలలుగా ప్రభుత్వ పెద్దల వద్దకు వెళ్లి అనేక విజ్ఞప్తులు చేశారు. ప్రభుత్వంలో కదలిక లేకపోవడంతో ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి సహాయాన్ని కోరారు. దళితులకు అండగా ఉంటానని చెప్పిన కౌశిక్‌రెడ్డి.. దళితబంధు రెండో విడుత దరఖాస్తులు స్వీకరించి ప్రభుత్వానికి విన్నవిస్తానని చెప్పారు. దరఖాస్తులు ఇచ్చేందుకు శనివారం మూడు వేలకుపైగా దళితులు హుజూరాబాద్‌లోని ఎమ్మెల్యే ఇంటికి వచ్చారు. ఈ సందర్భంగా కొందరు దళితుల విజ్ఞప్తి మేరకు స్థానిక చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసేందుకు ఎమ్మెల్యే బయలుదేరగా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినా, అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసిన ఎమ్మెల్యే దళితులతో కలిసి అక్కడే ధర్నాకు దిగారు. పోలీసులు అడ్డుకుని ఎమ్మెల్యేను అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా దళితులు తీవ్రంగా ప్రతిఘటించారు. పోలీసులు, దళితుల మధ్య తీవ్రస్థాయిలో తోపులాట జరిగింది.
ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి చుట్టూ పెద్ద సంఖ్యలో మోహరించిన పోలీసులు అదుపులోకి తీసుకునే క్రమంలో అమానుషంగా ప్రవర్తించారు. ఒక ఎమ్మెల్యే అని చూడకుండా చర్మం వడిపెడుతూ.. చేతులు పైకి లేపి పక్కటెముకలపై పిడిగుద్దులు గుద్దుతూ పోలీసు వాహనం వైపు లాక్కెళ్లారు. పోలీసుల చర్యను ఎమ్మెల్యే ప్రతిఘటించడంతో ఆయన చేతులు వడి పెట్టి దౌర్జన్యంగా ప్రవర్తించారు. పక్కటెముకలపై పిడిగుద్దుల గుద్దడంతో ఎమ్మెల్యేకు ఊపిరాడని పరిస్థితి ఏర్పడింది. గమనించిన దళితులు పోలీసులను అడ్డుకోగా, వారిపైనా దౌర్జన్యానికి దిగారు. దళితులను చెదరగొట్టిన పోలీసులు ఎమ్మెల్యేను నేరుగా స్థానిక ఏరియా దవాఖానకు తరలించారు. అక్కడికి చేరుకున్న దళితులు చిరిగిపోయిన ఆయన చొక్కాను విప్పి సపర్యలు చేశారు.
అనంతరం వైద్యులు ప్రాథమిక చికిత్స అందించారు. అంతలో అక్కడికి చేరుకున్న మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఎమ్మెల్యే ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయనను దగ్గరుండి కరీంనగర్‌లోని అపోలో రీచ్ దవాఖానకు తరలించారు. అక్కడ పరీక్షల అనంతరం వైద్యుల సూచనల వీణవంకలోని ఎమ్మెల్యే స్వగృహానికి తరలించారు. ఆయన వెంట మాజీ మంత్రి గంగుల కమలాకర్, మాజీ ఎమ్మెల్యే వొడితల సతీశ్‌కుమార్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు ఉన్నారు. కాగా, అపోలో రీచ్‌లో ఎమ్మెల్యేకు పరీక్షలు నిర్వహిస్తున్న సమయంలో చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌తో పాటు బీఆర్ఎస్ నాయకులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని, పరామర్శించారు.
దళితబంధు ధర్నాలో ఇల్లందకుంట మండలం కనగర్తికి చెందిన రామంచ రాకేశ్, జమ్మికుంట పట్టణానికి చెందిన నాని, జమ్మికుంట మండలం మాచనపల్లికి చెందిన పర్లపల్లి రమేశ్‌ను లక్ష్యంగా చేసుకుని పోలీసులు పిడిగుద్దులు కురిపించారు. హుజూరాబాద్ పట్టణం బోర్నపల్లికి చెందిన పర్లపల్లి రాజమణి అనే మహిళను పోలీసులు తోసి వేశారు. ఆమె తలకు గాయాలవగా, స్థానిక ప్రైవేట్ దవాఖానకు తరలించారు. మిగతా ముగ్గురు ప్రభుత్వ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. వీరిని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పరామర్శించారు. అవసరమైతే హైదరాబాద్ తీసుకెళ్లి మెరుగైన చికిత్స చేయిస్తామని గంగుల వారికి భరోసా ఇచ్చారు.
హుజూరాబాద్ పట్టణంలో దళితులు చేపట్టిన ధర్నాను విచ్ఛిన్నం చేసేందుకు పోలీసులు తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి ఇంటి నుంచి వస్తున్న దళితులను అడ్డుకున్నది మొదలు ఆయనను స్థానిక ఏరియా దవాఖానలో చేర్పించే వరకు తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్భంగా పోలీసు అధికారులతో ఎమ్మెల్యే సహా పలువురు దళితులు వాదనకు దిగారు. తమకు న్యాయం అడిగితే కొడతారా.. అని నిలదీశారు. ఈ సందర్భంగా పోలీసులకు, ప్రభుత్వానికి, సీఎం రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వరంగల్, కరీంనగర్ ప్రధాన రహదారిపై ఎటు మూడు, నాలుగు కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. ట్రాఫిక్ కంట్రోల్ చేసేందుకు దాదాపు గంటన్నర సమయం పట్టింది.
హైదరాబాద్, నవంబర్9 (నమస్తే తెలంగాణ): దళితబంధు లబ్ధిదారులకు మద్దతుగా నిలిచిన ఎమ్మె ల్యే పాడి కౌశిక్‌రెడ్డితో పోలీసులు వ్యవహరించిన తీరు హేయమని రాష్ట్ర దళితబంధు సాధన స మితి మండిపడింది. పోలీసుల దుశ్చర్యను తీవ్రంగా ఖండిస్తున్నట్టు దళితబంధు సాధ న సమితి రాష్ట్ర అధ్యక్షుడు కోగిల మహేశ్, కో ఆర్డినేటర్ రమేశ్, సలహాదారు సంజీవ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వం దళితుల కోసం పోరాడే నాయకుల పట్ల దుర్మార్గంగా వ్యవహరించడం సరికాదని నిప్పులు చెరిగారు.
మిర్యాలగూడ, నవంబర్ 9 : ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై పోలీసులు దా డి హేయమైన చర్య అని ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి పేర్కొన్నారు. శనివారం నల్లగొం డ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని తన కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం చేస్తున్న తప్పులను ప్రశ్నించిన ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై పోలీసులు అమానుషంగా దాడి చేశారని ఆరోపించారు.
ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి ఆధ్వర్యంలో శాంతియుతంగా ధర్నా చేస్తుంటే రేవంత్‌రెడ్డి అనుచరులుగా పనిచేస్తున్న పోలీసులు అకారణంగా మాపై దాడి చేశారు. బూటుకాళ్లతో తంతూ గాయపరిచారు. దీనిపై పూర్తి బాధ్యత సీఎందే. దళితుల మీద దాడి జరగడం ప్రభుత్వ చేతగానితనానికి నిదర్శనం. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇది సిగ్గుచేటు.
– పర్లపల్లి రమేశ్, మాచనపల్లి, జమ్మికుంట మండలం, కరీంనగర్ జిల్లా
దళితబంధు రెండో విడుత ఇవ్వాలని దండం పెట్టి అడుగుతున్నం. దళితబంధు వస్తే మా జీవితాలు బాగుపడుతయనుకున్నం. పోలీసులు నా ముక్కు మూసిన్రు.. పక్కబొక్కల మీద గుద్దిన్రు. మంత్రి పొన్నం ప్రభాకర్.. మమ్ముల ఎందుకు ఇంత గోసపెట్టుకుంటన్రు. మా అకౌంట్లళ్ల ఉన్న పైసలు మాకు ఇవ్వడానికి మీకేం నొప్పి. రేవంత్‌రెడ్డి దళితులకు చేసే న్యాయమిదేనా?
– రామంచ రాకేశ్, కనగర్తి, ఇల్లందకుంట మండలం, కరీంనగర్ జిల్లా
కాంగ్రెసోళ్లు ఇంకోసారి ఓట్లు అడగడానికి రావద్దు. ఓట్ల కోసం ఇంటిచుట్టూ తిరిగిన్రు. గెల్సినంక మమ్మల్ని రోడ్డు మీదికి ఈడ్చిన్రు. అంకౌట్లలో ఉన్న డబ్బులు ఇవ్వకుండా ఎందుకింత క్షోభపెడుతున్నరు. ఎన్నికల హామీలు ఏమైనయ్. మహిళలకు ఇస్తానన్న డబ్బులు ఎటుపోయినయ్. మమ్మల్ని రోడ్డున పడేసినందుకు రేవంత్‌రెడ్డికి దళిత మహిళల ఉసురు తగులుతది.
– గీతాంజలి, జమ్మికుంట, కరీంనగర్ జిల్లా
దళిత బంధు నిధులు అడిగిన నన్ను ఆపాలని ప్రయత్నిస్తారా..? దాడి చేస్తరా..? పోలీస్ అధికారులు రాసిపెట్టుకోండి. నాలుగేండ్లలో కేసీఆర్ ముఖ్యమంత్రి కాక తప్పదు. దాడి చేసినవారి ఉద్యోగాలు ఊడక తప్పదు. ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని అడ్డంకులు తెచ్చినా దళితుల కోసం నా పోరాడటం ఆగదు. తలతెగినా దళితులకు అన్యాయం జరగకుండా చూసుకుంటా. ఎన్ని దాడులు చేసినా, ఎన్ని ఆంక్షలు పెట్టినా దళితులకు న్యాయం జరిగే వరకు నా పోరాటం ఆగదు. దళితబంధు ఇవ్వకుంటే కాంగ్రెసోల్లను ఊర్లల్ల తిరుగనిచ్చేదిలేదు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని నా దళిత కుటుంబ సభ్యులారా, నాపై జరిగిన దాడికి ఎవరూ అధైర్యపడకండి. మీకు న్యాయం జరిగే వరకు నా అడుగులు మీతోనే. రేవంత్ రెడ్డి.. మొగోనివైతే హుజూరాబాద్ దళితవాడల్లో పాదయాత్ర చెయ్.
– పాడి కౌశిక్‌రెడ్డి, హుజూరాబాద్ ఎమ్మెల్యే
30 ఏండ్ల రాజకీయ జీవితంలో ఎమ్మెల్యేలపై దాడి జరుగడం చూడలేదు. సౌత్ ఇండియాలోనే మొట్టమొదటిసారిగా తెలంగాణలో కాంగ్రెస్‌పాలనలో ఇలాంటి దాడి జరిగింది. దళితబంధు లబ్ధిదారులకు రెండో విడత సాయం ఇవ్వాలని దళితులతో కలిసి ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందివ్వాలని చూస్తే పోలీసులను పెట్టి దాడి చేయించడం అమానుషం. పోలీసులు ఎమ్మెల్యేపై చేసిన దాడిపై స్పీకర్ విచారణ జరపాలి. నిరసన తెలపడం తెలంగాణలో నేరంగా మారింది. ఈ పద్ధతిని ప్రజా సంఘాల నాయకులు ఖండించాలి. ఐదు వేల మంది అకౌంట్లలో దళితబంధు నిధులు ఉన్నయి. వాటిని వెంటనే విడుదల చేయాలి.
– గంగుల కమలాకర్, మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే
రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రతీకార పాలన సాగిస్తున్నారు. దళితబంధు నిధు లు విడుదల చేయాలన్న ఎమ్మె ల్యే పాడికౌశిక్‌రెడ్డి మీద పాశవిక దాడి చేస్తారా? హామీలు అమలు చేయాలని అడిగితే జర్నలిస్టు రంజిత్‌రెడ్డిని అరెస్టు చేయడమేంటి? అణచివేతలు తెలంగాణ సమాజానికి కొత్తేం కాదని.. ఎన్ని అరెస్టులు చేస్తే అంత ఎత్తున ఎగిసిపడతాం.
– మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
దళిత బంధు రెండో విడత నిధులు చెల్లించాలని ఒక ఎమ్మెల్యే అడగటం తప్పా..? దళితుల పక్షాన నిలబడి ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా? తెలంగాణ ప్రజలు కోరుకున్న మార్పు ఇదేనా..? ఇది ప్రజాపాలన కాదు.. రేవంత్‌రెడ్డి రాక్షస పాలన. ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి ఆరోగ్యం, భద్రతపై పూర్తి బాధ్యత ప్రభుత్వమే వహించాలి.
– మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
ప్రశ్నించే వారిపై కేసులు పెట్టడమే ప్రజాపాలనా? రేవంత్‌రెడ్డి..ఇందిరమ్మ రాజ్యమంటే ఇదేనా?ఈ కాంగ్రెస్ పాలన ఇందిరమ్మ రాజ్యంలోని ఎమర్జెన్సీని తలపిస్తున్నది. దళితబంధు కోసం దళితులతో కలిసి ధర్నా చేస్తున్న ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై పోలీసులు దాడి చేయడం దారుణం. ప్రజాప్రతినిధిపై కర్కశంగా వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే కాంగ్రెస్ పాలనలో సామాన్యుల పరిస్థితి ఆందోళనకరం.
– మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి
ప్రజాపాలనలో దళితుల పక్షాన పోరాడితే దాడి చేస్తారా? దళిత బంధు నిధుల కోసం దళితులు చేస్తున్న ధర్నాకు మద్దతు తెలిపిన ఎమ్మెల్యేపై పోలీసులు దౌర్జన్యంగా దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదేమైనా ప్రభుత్వం తన తీరును మార్చుకోవాలి.
– వొడితల సతీశ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే
హుజూరాబాద్ చౌరస్తాలో అంబేదర్ సాక్షిగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై పోలీసుల దాడి సరికాదు. ఇది ప్రజాపాలన కాదు.. రేవంత్ మార్ రాక్షస పాలన. కాంగ్రెస్ మార్ నిరంకుశ పాలన. ఇందిరమ్మ ఎమర్జెన్సీ నాటి నిర్బంధ పాలన.
– సుంకె రవిశంకర్, చొప్పదండి మాజీ ఎమ్మెల్యే
సీఎం రేవంత్‌రెడ్డి కనుసన్నల్లోనే హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై దాడి జరిగింది. దళిత బంధు సాయం ఏమైందని అడిగితే ఎమ్మెల్యేపై పోలీసులు దాడికి దిగుతారా? కాంగ్రెస్ పార్టీ, రేవంత్‌రెడ్డి దళిత ద్రోహులు. కౌశిక్‌రెడ్డికి దళిత సమాజం అండగా ఉంటుంది.
– ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్
ప్రజాప్రతినిధులను అరెస్టు చేసి ప్రతిపక్షాల గొంతు నొక్కాలనుకోవడం మూర్ఖత్వం. దళితబంధు పథకాన్ని అమలు చేయాలని.. దళితుల కోసం మాట్లాడిన ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిని అరెస్టు చేయడం అప్రజాస్వామికం. అరెస్టు చేసిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలి.
– తెలంగాణ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు ఉపేంద్ర
అంబేడ్కర్ విగ్రహం ముందే రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొడిచే విధంగా సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వ్యహరించింది. దళితుల పార్టీ, బడుగు బలహీన వర్గాల పార్టీ అని చెప్పుకునే కాంగ్రెస్ నేతలు.. దళిత వ్యతిరేకులుగా నిలుస్తున్నారు. ఒకవైపు రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని పట్టుకుని తిరుగుతుంటే… రేవంత్ రెడ్డి మాత్రం రాజ్యాంగ స్ఫూర్తిని అణచివేస్తున్నారు.
– బీఆర్ఎస్ నాయకుడు ఏనుగుల రాకేశ్‌రెడ్డి