Dacoit Operation | సుల్తాన్‌బజార్, జూలై 12: హైదరాబాద్ నడిబొడ్డున శాంతిభద్రతలు విఫలం అయ్యాయి. నాంపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో అర్ధరాత్రి కాల్పులు తీవ్ర సంచలనం సృష్టించాయి. ఈ మధ్య రాత్రిపూట రైల్వేస్టేషన్లో నిద్రిస్తున్న ప్రయాణికుల సెల్ఫోన్లు, బ్యాగులు, పర్సులు, నగదు చోరీ చేస్తున్నట్టు సమాచారం అందటంతో నాంపల్లి పోలీసులు, సెంట్రల్‌జోన్ పోలీసుల సంయుక్తాధ్వర్యంలో గురువారం అర్ధరాత్రి 12 గంటల తర్వాత డెకాయిట్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించటంతో పోలీసులు ప్రశ్నించారు.
వారు తప్పించుకొనేందుకు మారణాయుధాలతో పోలీసులపై దాడికి పాల్పడ్డారు. వెంటనే పోలీసులు ఆత్మరక్షణ కోసం వారిపై కాల్పులు జరిపారు. ఇందులో మైనర్ బాలుడి తొడకు బుల్లెట్ తగిలింది. దీంతో అతడిని ఉస్మానియా దవాఖానకు తరలించి, మరో వ్యక్తిని అదుపులోకి తీసుకొన్నామని నాంపల్లి ఇన్స్పెక్టర్ అప్పలనాయుడు తెలిపారు. మల్లేపల్లి మాంగార్‌బస్తీకి చెందిన వారిద్దరు అనేక కేసుల్లో నిందితులుగా ఉన్నారని వెల్లడించారు. దర్యాప్తు చేపట్టామని పేర్కొన్నారు.