Sabitha Indra Reddy | తెలంగాణ అసెంబ్లీ సమావేశాల వేళ మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు తీవ్ర చర్చకు దారి తీసింది. అసెంబ్లీకి వస్తున్న మహిళా ప్రజాప్రతినిధులను కూడా చూడకుండా పోలీసులు కర్కశంగా వ్యవహరించారు. అసెంబ్లీ లోపలికి వెళ్తున్న సమయంలో ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి చీరను పోలీసులు లాగడంతో తీవ్ర ఆవేదనకు గురైన ఆమె అక్కడే కన్నీళ్లు పెట్టుకున్నారు. అదే సమయంలో మహిళా సభ్యులను అరెస్టు చేసే క్రమంలో సబితా ఇంద్రారెడ్డిని జుట్టు పట్టుకుని బలవంతంగా వాహనంలోకి ఎక్కించారు.
మహిళా ఎమ్మెల్యేలు అనే కనీస గౌరవం కూడా లేకుండా పోలీసులు వ్యవహరించిన తీరు తీవ్ర విమర్శలకు దారితీసింది. ప్రజల తరఫున అసెంబ్లీకి హాజరయ్యేందుకు వచ్చిన మహిళా ప్రజాప్రతినిధులనే ఇలా అవమానించడం ఏమిటని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. సునీతా లక్ష్మారెడ్డి చీరను పోలీసులు లాగిన సమయంలో వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
అసెంబ్లీ వద్ద సబితా ఇంద్రారెడ్డి జుట్టు పట్టుకొని అమానుషంగా ప్రవర్తించిన పోలీసులు
మహిళా ఎమ్మెల్యేలని కూడా చూడకుండా కర్కశంగా వ్యవహరిస్తున్న పోలీసులు https://t.co/SvwSMzjwRW pic.twitter.com/vAnjQSehPK
— Telugu Scribe (@TeluguScribe) September 7, 2026
ఇవాళ అసెంబ్లీ చరిత్రలో చీకటి రోజు అని సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఎలాగూ మహిళలకు భద్రత లేదని.. శాసనసభలో కూడా భద్రత లేకపోవడం దుర్మార్గమని మండిపడ్డారు. మేం నల్లటి టీషర్ట్ కూడా ధరించలేదు.. అయినా మమ్మల్ని ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నిస్తే పోలీసులు దౌర్జన్యంగా వ్యవహరించారని అన్నారు. ఇదేనా ప్రజాపాలనలో మహిళలకు దక్కే గౌరవమని ప్రశ్నించారు.
నిరసన చేయడానికి మాకు హక్కు లేదా అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు. మహిళలు అని కూడా చూడకుండా ఇష్టానుసారంగా తోసేస్తున్నారని మండిపడ్డారు. వెయ్యి రోజుల పాలన గురించి కాంగ్రెస్ నాయకులు గొప్పలు చెప్పుకుంటున్నారని అన్నారు. కానీ అసలు నిజాలు తెలుస్తాయనే తమను అసెంబ్లీకి రానివ్వడం లేదని ఆరోపించారు.
కాగా, అసెంబ్లీ ఎదుట బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పోలీసులు వ్యవహరించిన తీరును ఆ పార్టీ తీవ్రంగా ఖండించింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అసెంబ్లీకి రాకుండా ప్రభుత్వం వ్యవహరించిన తీరుకు నిరసనగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎక్కడికక్కడ ఆందోళనలు చేపట్టాలని బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. అసెంబ్లీ గేటు వద్ద జరిగిన ఘటనను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు సూచించింది.