నాంపల్లి క్రిమినల్ కోర్టులు, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ): లగచర్ల రైతులపై నమోదైన కేసులో రెండో నిందితుడిగా ఉన్న సురేశ్‌ను రెండురోజుల కస్టడీకి అప్పగించాలని కోరుతూ పోలీసులు సోమవారం ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో సురేశ్‌ను కీలక సూత్రధారిగా పేర్కొన్న పోలీసులు ఆయన నుంచి మరింత సమాచారాన్ని సేకరించాల్సి ఉన్నదని స్పష్టం చేశారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్, ఇతర అధికారులను లగచర్లకు రప్పించి వారిపై దాడి చేసేలా రైతులను ప్రేరేపించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న సురేశ్ అరెస్టు సమయంలో విచారణకు సహకరించలేదని, ఆయన ఫోన్‌కాల్స్ డాటా ఆధారంగా పలు వివరాలను రాబట్టాల్సి ఉన్నదని పబ్లిక్ ప్రాసిక్యూటర్ దుర్గాజీ కోర్టుకు తెలిపారు.
ఎన్నికల కోడ్ కేసు నుంచి స్పీకర్‌కు విముక్తి ; నిరాహార దీక్ష కేసును కొట్టేసిన హైకోర్టు
హైదరాబాద్, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ): లోక్‌సభ-2019 ఎన్నికల సమయంలో ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించి నిరాహార దీక్షలో పాల్గొన్నారంటూ దాఖలైన కేసు నుంచి వికారాబాద్ ఎమ్మెల్యే, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు విముక్తి లభించింది. ఆ కేసును హైకోర్టు కొట్టివేసింది. ఈ మేరకు జస్టిస్ కే లక్ష్మణ్ సోమవారం తీర్పు వెలువరించారు.