హైదరాబాద్ సిటీబ్యూరో, బేగంపేట, జనవరి 17 (నమస్తే తెలంగాణ): నిత్యం నిర్బంధాలు, అరెస్టులతో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలపై ఉక్కుపాదం మోపుతున్నది. సికింద్రాబాద్ ప్రాంతాన్ని మల్కాజిగిరి జోన్లో కలిపి ఆ ప్రాంత ఉనికిని చెరిపేసేందుకు కుట్రలు చేస్తున్న కాంగ్రెస్ సర్కారుకు వ్యతిరేకంగా శాంతియుత ర్యాలీకి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ పిలుపునిచ్చారు. సికింద్రాబాద్‌ను ప్రత్యేక కార్పొరేషన్ చేయాలని ఆ ప్రాంత ప్రజలంతా శాంతియుత ర్యాలీకి మద్దతుగా నల్లదుస్తులు, నల్ల జెం డాలు, బ్యాడ్జీలతో వేలాదిగా తరలివచ్చారు.
సికింద్రాబాద్‌లోని ప్రజలు తమ ప్రాంత అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు తండోపతండాలుగా కదలివచ్చారు. ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా గూగుల్ మ్యాప్‌ల ద్వారా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి నచ్చినట్టు విభజించి ప్రజల మనోభావాలను దెబ్బతీసి, అభివృద్ధిని కట్టడి చేసేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మోండా మార్కెట్ నుంచి టాటా, జనరల్ బజార్ మీదుగా ఎంజీరోడ్‌లోని గాంధీ విగ్రహం వద్దకు వేలాదిగా ప్రజలు చేరుకున్నారు. బైఠాయించిన నిరసనకారులను పోలీసులు అడ్డుకున్నారు. ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీస్ వ్యాన్లలో బలవంతంగా ఎక్కించారు. ఈ క్రమంలో పోలీసులు, నిరసనకారుల మధ్య వాగ్వాదం జరిగింది. పలువురు మహిళలకు గాయాలయ్యాయి. కొంతమంది సొమ్మసిల్లి పడిపోయారు. పోలీసులు అరెస్టు చేసిన వారిని రాంగోపాల్‌పేట పీఎస్‌కు తరలించారు.
అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు: హరీశ్‌రావు
అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని, నిర్బంధాలకు భయపడేది లేదని మాజీ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యమే ఏడో గ్యారెంటీ అని చెప్పిన రేవంత్‌రెడ్డి.. నేడు ప్రశ్నించే గొంతుకలను పోలీసులతో అణచివేస్తూ నిరంకుశత్వమే తమ పాలసీ అని నిరూపిస్తున్నారని శనివారం ఎక్స్ ద్వారా ధ్వజమెత్తారు. సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సాధన కోసం మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన శాంతియుత ర్యాలీని అడ్డుకోవడం, కార్యకర్తలను అరెస్టు చేయడం హేయమైన చర్యగా పేర్కొన్నారు. రాష్ట్రాన్ని పోలీస్ రాజ్యంగా మార్చారని దుయ్యబట్టారు. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. చారిత్రక సికింద్రాబాద్ అస్థిత్వం కోసం తమ పోరాటం ఆగదని స్పష్టంచేశారు.
