హైదరాబాద్, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ నేతలపై పోలీసులు మరోసారి దౌర్జన్యకాండకు దిగారు. గురువారం ఎక్కడికక్కడ అరెస్ట్‌లకు ఉపక్రమించారు. బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌ను బంజారాహిల్స్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఉదయం అరెస్ట్ చేసి ఠాణాకు తరలించారు. అలాగే సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లోని కార్పొరేషన్ మాజీ చైర్మన్ క్రిశాంక్ ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. కార్ఖాన సీఐ అనురాధ హంగామా చేశారు. క్రిశాంక్ ఇంట్లో లేడని చెప్పినా ఆయన ఏడేళ్ల కూతురు పరీక్ష రాసేందుకు స్కూల్‌కు వెళ్తుండగా అడ్డుకున్నారు.
బంధువుల వద్ద ఉన్న సెల్‌ఫోన్‌ను లాక్కున్నారు. అదేవిధంగా బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పడాల సతీశ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిగ వెంకటేశ్‌గౌడ్, రాష్ట్ర నేతలు ఐద్వెత్, హేమంత్, వినయ్, హర్ష, ఆసిఫ్ తదితరులను ఉదయం అదుపులోకి తీసుకున్నారు. బలవంతంగా పోలీసు వాహనం ఎక్కించి ఉప్పల్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. విద్యార్థి విభాగం ఎలాంటి ఆందోళనలకు పిలుపునివ్వకపోయినా అర్ధరాత్రి వేళ బీఆర్ఎస్వీ నేతలను పోలీసులు అక్రమంగా నిర్బంధించడం అత్యంత దుర్మార్గమని బీఆర్ఎస్వీ ఉపాధ్యక్షుడు తుంగ బాలు మండిపడ్డారు.