కృష్ణ/వెల్దండ, నవంబర్ 1: గుంతలమయంగా మారిన రోడ్లను సొంత డబ్బులతో బాగు చేసిన ఇద్దరు వ్యక్తులు ప్రజలు, వాహనదారుల మన్ననలు పొందారు. నారాయణపేట జిల్లా కృష్ణ మండలం గుడెబల్లూర్ పంచాయతీలోని టైరోడ్ నుంచి మురహరిదొడ్డి గ్రామానికి వెళ్లే రోడ్డు గుంతలమయంగా తయారైంది. ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించలేదు. మురహరిదొడ్డి గ్రామానికి చెందిన దుకాణం బాబు సొంత డబ్బు రూ.7లక్షలతో రోడ్డు వేయించారు. బాబును స్థానికులు సన్మానించారు.
నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మండలం కొట్రకు చెందిన పోలీస్ కానిస్టేబుల్ దండోత్కర్ ఎంకోజీ రోడ్డుకు మరమ్మతులు చేయించారు. హైదరాబాద్-శ్రీశైలం జాతీయ రహదారి నుంచి గ్రామానికి వెళ్లే రోడ్డు మూలమలుపులు ప్రమాదకరంగా ఉన్నాయి. దీంతో కానిస్టేబుల్ సొంత ఖర్చులతో కొమ్మలు తొలగించి రోడ్డును చదును చేయించారు.