కరీంనగర్, మే 10(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కేంద్ర మంత్రి కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ విషయంలో పోలీసులు ఒత్తిళ్లకు తలొగ్గారంటూ వస్తున్న విమర్శలకు, తాజాగా జరిగిన పలు పరిణామాలు బలం చేకూర్చుతున్నాయి. నిజానికి బాధితుల వివరాల ప్రకారం ఫిర్యాదు తయారు చేయకుండా.. నామమాత్ర సెక్షన్లు వర్తించేలా పిటిషన్ తయారు చేసి, వాటిపై సంతకాలు చేయించుకున్నట్టు అత్యంత విశ్వసనీయ సమాచారం.
ఇదిలా ఉంటే మెజిస్ట్రేట్ ముందు బాలిక వాంగ్మూలం రికార్డు చేయకముందే ఆదివారం మెడికల్ టెస్టుకు రావాలని పోలీసులు ఒత్తిడి చేసినట్టు తెలుస్తుండగా అందుకు బాధిత కుటుంబం నిరాకరించినట్టు సమాచారం. నిబంధన ప్రకారం పోక్సో కేసు నమోదైన వెంటనే బాధితులకు ఎఫ్ఐఆర్ ఇవ్వాల్సి ఉండగా, అందుకు విరుద్ధంగా బాధితులకు కాకుండా బండి భగీరథ్ న్యాయవాదికి మాత్రం అప్పగించినట్టు తెలిసింది. ఆదివారం పోలీస్‌స్టేషన్ సీసీ కెమెరాలను పరిశీలిస్తే వాస్తవాలు బహిర్గతం అవుతాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
బండి సంజయ్ కుమారుడు భగీరథ్‌పై పోక్సో కేసు విషయంలో పోలీసుల తీరుపై ముందునుంచీ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ బాలికపై జరిగిన అఘాయిత్యానికి పెట్టాల్సిన సెక్షన్లు పెట్టకుండా కేసును నీరుగార్చేలా సెక్షన్లు పెట్టారన్న విమర్శలు వస్తున్నాయి. నిజానికి బాధితురాలు తల్లి.. ఆ అమ్మాయి విషయంలో జరిగిన ప్రతి ఘటననూ పోలీసులకు వివరించినట్టు తెలుస్తున్నది. ఆమె చెప్పిన ప్రకారం అన్నీ వివరాలు నమోదు చేసుకున్నట్టు చెప్పి.. ఆ మేరకు సదరు ఫిర్యాదుపై సంతకం తీసుకున్నారు. ఒక మైనర్ పదే పదే లైంగిక దాడికి గురైనప్పుడు.. పోక్సోలోని సెక్షన్ 5, 6 వరిస్తుందని న్యాయనిపుణులు చెబుతున్నారు.
ఈ సెక్షన్లు వర్తింపజేస్తే 20 ఏండ్ల కఠిన జైలు శిక్ష లేదా అంతకుమించి శిక్షలు వేయవచ్చని చట్టం చెబుతున్నది. నిజానికి బాలిక విషయంలో ఈ దారుణాలు జరిగినట్టు బాధిత తల్లి పోలీసులకు వివరించినట్టు తెలుస్తున్నది. అయితే ఈ పదం వాడకుండా పోలీసులు ఫిర్యాదు రాసుకొని, సంతకాలు తీసుకున్నట్టు తెలిసింది. నిజానికి బాధిత కుటుంబానికి చట్టాలు, కొన్ని లీగల్ పదాలపై పెద్దగా అవగాహన లేకపోవడాన్ని ఆసరాగా తీసుకున్న పోలీసులు, బండి భగీరథ్‌కు అనుగుణంగా వివరాలు రాసుకున్నారనే విమర్శలున్నాయి. అక్కడే కేసు వీగిపోయాలా తమ లౌక్యాన్ని ప్రదర్శించారని తెలుస్తున్నది.
పోక్సో కేసును నీరుగార్చేందుకు పోలీసులే ప్రయత్నాలు చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సదరు బాలికను మెడికల్ టెస్టుకు తీసుకొని రావాలని పోలీసులు సదరు కుటుంబానికి ఆదివారం చెప్పినట్టు తెలుస్తున్నది. నిజానికి మెజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం రికార్డు చేసిన తర్వాత మెడికల్ టెస్టుకు తీసుకెళ్లాల్సి ఉంటుందని న్యాయనిపుణులు చెబుతున్నారు. కానీ, అలా కాకుండా ముందుగానే మెడికల్ టెస్టుకు తీసుకెళ్లి, కేసును నీరు గార్చేలా రిపోర్టును తయారుచేయడానికి ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలున్నాయి.