పానీ కా పానీ! ‘మేం బురద చల్లుతాం.. మీరు కడిగేసుకోండి! మేం విషం చిమ్ముతాం.. మిమ్మల్ని మీరు రక్షించుకోండి!’.. ఇన్నాళ్లూ బీఆర్ఎస్ నేతలు లక్ష్యంగా ఓ వర్గం మీడియా కుట్రపూరితంగా రచించిన వ్యక్తిత్వహనన కార్యక్రమం ఇలాగే సాగింది. ‘అధికారం’ అండతో నిర్మించిన అబద్ధాల భాండం ఇప్పుడు బద్ధలైంది.
రాజకీయ వికృత క్రీడలో భాగంగా ప్రచారంలో పెట్టిన కట్టుకథల, కాల్పనిక కథనాల పుట్టపగిలింది.సినీ ప్రముఖుల ఫోన్లనూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ట్యాప్ చేసిందంటూ ఏడాదిన్నరగా వండివార్చిన కథనాలన్నీ శుద్ధ అబద్ధాలేనని తేలిపోయాయి. అలాంటి ఏ ఒక్క ఆధారమూ దొరకలేదని, అసలు ఫోన్ ట్యాపింగ్ కేసులో వాళ్లెవరూ బాధితులుగా లేరని దర్యాప్తు అధికారులు ధ్రువీకరించినట్టు పేర్కొంటూ ‘ది హిందూ’ తాజాగా ప్రచురించిన కథనం ఇన్నాళ్లూ సాగిన క్షుద్రప్రచారాన్ని తుత్తునియలు చేసింది.
హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ): సినిమా నటీనటుల ఫోన్లు ట్యాప్ అయ్యాయంటూ పచ్చ మీడియా చేసిన పిచ్చి ప్రచారం అంతా పచ్చి అబద్ధమని తేలిపోయింది. సినీతారల ఫోన్లు ట్యాప్ అయినట్టు ఎలాంటి ఆధారాలు లేవని పోలీసుశాఖ స్పష్టంచేసింది. ఎస్ఐబీ మాజీ అధికారులు సేకరించిన నంబర్ల లిస్టులో ఏ హీరోయిన్ పేరు కూడా లేదని తేటతెల్లం చేసింది. ఈ కేసును బీఆర్ఎస్కు, ఆ పార్టీ ముఖ్యులకు అంటగట్టే ప్రయత్నం జోరుగా సాగుతున్నట్టు ఆ అధికారులు జాతీయ మీడియా ‘ది హిందూ’ పత్రికకు చెప్పారు. టాలీవుడ్‌కు చెందిన హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ కాలేదని తెలిపారు. ఈ అంశంపై ‘నమస్తే తెలంగాణ’ లోతుగా ఆరా తీయగా.. ఇదే విషయాన్నే స్పష్టంచేశారు. ట్యాపింగ్ గురించి తనపై వస్తున్న ఆరోపణలు అంతా అవాస్తవమని, ఎలాంటి విచారణకైనా సిద్ధమని పదేపదే చెప్తూ వస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాటలే… ఇప్పుడు నిజమని తేలింది.
కానీ ఇన్నాళ్లు ఈ నిజాలను పచ్చమీడియా పరిగణలోకి తీసుకోలేదు. తాము పట్టిన కుందేలుకు మూడేకాళ్లు అన్నట్టుగా చిందులేసింది. నవ్విపోదురుగాక నాకేంటి అన్న చందంగా.. చిందులేసింది. ట్యాపింగ్ పేరుతో వికృతంగా రాతలు రాసింది. కానీ సోమవారం ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ‘ది హిందూ’ దినపత్రిక కరస్పాండెంట్ మర్రి రాము రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారులను ప్రస్తావిస్తూ ఒక సంచలనమైన పరిశోధనాత్మక కథనం రాశారు. ఆ కథనంలో హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ కాలేదని కుండబద్దలు కొట్టారు. సినీతారలకు సంబంధించిన ఫోన్లు ట్యాప్ అయినట్టుగా ఏ ఆధారమూ లేదని, ఇదంతా మీడియా హడావుడి మాత్రమేనని, ఇదే విషయం సదరు పోలీసు ఉన్నతాధికారులు స్పష్టంచేసినట్టుగా కథనంలో పేర్కొన్నారు.
విలువలు పాతరేసి.. బరితెగింపు రాతలు
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు పేరిట హడావుడి చేస్తున్నది. కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టుగా పచ్చమీడియా కల్పిత కథనాలను అల్లింది. బీఆర్ఎస్ హయాంలో ‘హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ అయ్యాయి’ అని, ‘చాలామంది హీరోల కుటుంబంలో ఎస్ఐబీ అధికారులు చిచ్చు పెట్టారు’ అని, ‘కుటుంబాలను విడదీశారు’ అని ఆధారాలు లేకుండా, పత్రికా విలువలు మరిచి.. అడ్డగోలుగా రకరకాల కట్టుకథలతో వార్తల పేరిట విష ప్రచారం చేశారు. సినీనటుడు నాగార్జున కుటుంబంపై నోటికొచ్చినట్టు మాట్లాడటం వల్ల మంత్రి కొండా సురేఖ పరువు నష్టం కేసు విచారణను ఎదుర్కొంటున్నారు. ఈ అడ్డూఅదుపులేని మాటలు, రాతలకు తోడు.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న నిరాధార లీకులు, వాటి ఆధారంగా కొన్ని టీవీ చానళ్లు, యూట్యూబ్ చానళ్లు వికృతంగా రెచ్చిపోయాయి. ఇదే క్రమంలో శ్రుతిమించిన చంద్రబాబు కాంపౌండ్‌లోని మహా టీవీ, ఏబీఎన్, ఆంధ్రజ్యోతి అబద్ధపు కథనాలు వడ్డివార్చాయి. బీఆర్ఎస్ వర్గాలు ఖండిస్తున్నా పరిగణలోకి తీసుకోకుండా పదేపదే ఇదే ధోరణి అవలంబిస్తుండటంతో బీఆర్ఎస్ నాయకులు, తెలంగాణవాదులు మహా టీవీ చానల్ ముందు నిరసన ప్రదర్శన నిర్వహించారు.
ఈ ఘటన చాలా ఉద్రిక్తంగా మారింది. ఇలాంటి దుష్ప్రచారం చేసే మరికొన్ని చానళ్లకు నిరసన సెగ తప్పదని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి హెచ్చరించారు. ఈ పరిణామాలపై ఆంధ్రజ్యోతి పత్రిక ఎండీ రాధాకృష్ణ సంపాదకీయం రాశారు. ‘తెలంగాణ బీఆర్ఎస్ జాగీరా?’ ప్రశ్నించారు. సుధీర్ఘమైన వ్యాసంలో మహా టీవీ ప్రస్తావన తీసుకొచ్చారు. మహాటీవీ చేసిన విష ప్రచారాన్ని కేవలం ‘థంబ్నెయిల్లో జరిగిన పొరపాటు’గా అభివర్ణించారు. అయితే.. దొంగా.. దొంగా అంటే రాధాకృష్ణ భుజాలు ఎందుకు తడుముకుంటున్నారని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టొద్దని, తెలంగాణ ఆత్మగౌరవంపై విషం చిమ్మితే సహించే ప్రసక్తేలేదని హెచ్చరించారు. ఈ వివాదం నడుస్తున్న నేపథ్యంలోనే ‘ది హిందూ’ కథనం వెలువడింది. ఇన్నాళ్లుగా కాంగ్రెస్ నేతలు, ప్రభుత్వ పెద్దలు చెప్పింది అబద్ధమని, పచ్చ మీడియా ప్రచారం శుద్ధ అబద్ధమని తేలిపోయింది. నిజం నిలకడ మీద తెలుస్తుందన్న బీఆర్ఎస్ నేతల మాటలే నిజమని స్పష్టమైంది. ఏ ఆధారమూ లేకుండానే కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు మీద కొన్ని మీడియా సంస్థలు ప్రసారం చేసిన కథనాలు అవాస్తవాలు అని వెల్లడయింది.
పచ్చపత్రికల పైత్యానికి.. కాంగ్రెస్ నేతల వత్తాసు
ఆనాడు పీసీసీ అధ్యక్షుడిగా, ఇప్పుడు ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి చేసిన, చేస్తున్న ఆరోపణలపై రాజకీయ విశ్లేషకులు మండిపడుతున్నారు. మీడియా సృష్టించిన అభూతకల్పనలను ఆయుధంగా చేసుకొని.. రేవంత్‌రెడ్డి అడ్డగోలుగా మాట్లాడారని గుర్తుచేస్తున్నారు. ఉన్నతమైన హోదాను మర్చిపోయి ప్రేలాపణలు పేలారనే విషయం స్పష్టమైపోయిందని చెప్తున్నారు. బాధ్యతగా మాట్లాడాల్సిన హోదాలో ఉన్న వ్యక్తి.. ‘సంబంధాలు’ అంటగట్టిన తీరు అంతా నాటకమని తేలిందని వివరిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రచారానికి తోడు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్‌గౌడ్, మంత్రి కొండా సురేఖ, మరికొందరు రేవంత్‌రెడ్డి గ్రూపు నాయకులు, సైకిల్ కాంగ్రెస్ ముఖ్యులు విచక్షణ మర్చిపోయి మాట్లాడారని గుర్తుచేస్తున్నారు. కాంగ్రెస్‌లోని సీనియర్ నేతల నుంచి, గల్లీల్లోని బ్యాచ్ వరకూ అడ్డూఅదుపు లేకుండా దిగజారి మాట్లాడారని చెప్తున్నారు. ఇప్పుడు నిజమేంటో తేలిపోయిందని, ఆ ముఠాలోని అందరూ ఇప్పుడేం ఏం సమాధానం చెప్తారని ప్రశ్నిస్తున్నారు.
సోషల్‌మీడియాలో వికృత ప్రచారం
ఒక ప్రథకం ప్రకారం కేటీఆర్ వ్యక్తిత్వాన్ని హననం చేసేందుకు అధికారంలోకి వచ్చిన వెంటనే ‘ముఖ్యనేత’ ప్రత్యేక చొరవ తీసుకున్నట్టు తెలుస్తున్నది. ఇదే ఆలోచనతో ఏపీలోని పచ్చ బ్యాచ్‌కు ‘బిస్కెట్లు’ వేసినట్టుగా పెద్దఎత్తున డబ్బులు కుమ్మరిస్తూ సోషల్‌మీడియాలో అడ్డగోలుగా వికృత ప్రచారం చేయించినట్టు విశ్వసనీయ సమాచారం. సినిమా హీరోయిన్లు, నటులు, యాంకర్లు, టీవీషోల ఆర్టిస్టుల ఫోన్లను కూడా ట్యాప్ చేయించారని అడ్డగోలు ప్రచారం చేయించారు. ఇక్కడ రాయడానికి కూడా వీలులేని దారుణమైన థంబ్ నెయిల్స్ పెట్టి, విషయ పరిజ్ఞానం లేనివాళ్లను విశ్లేషకులుగా రంగంలోకి దింపి మాట్లాడించారు. ఇష్టారీతిన మీమ్స్ చేయిస్తూ.. విష ప్రచారానికి తెరలేపారు. ఆంధ్రా సోషల్ మీడియాతో పోస్టులు పెట్టించారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు కుటుంబాలను టార్గెట్ చేస్తూ.. నిత్యం అబద్ధాలు పోస్టు చేశారు. అటు హీరోయిన్ల కుటుంబాలు, ఇటు రాజకీయ నాయకుల కుటుంబాలు, బంధువులను ఇబ్బంది పెట్టారు. ఈ మొత్తం నాటకం అంతా కూడా రేవంత్‌రెడ్డి జూబ్లీహిల్స్ ప్యాలెస్ నుంచి జరిగినట్టు విశ్వసనీయంగా తెలుస్తున్నది. ఆరు గ్యారంటీలపై ప్రజలు నిలదీసినప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ లీకుల పేరుతో పాలనను పాతరేయడమే ఆ ఎల్లోముఠా పనిగా పెట్టుకున్నదని సమాచారం.
ఇదీ.. పచ్చముఠా అసలు కుట్ర!
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆశీస్సులు, కాంగ్రెస్‌తో మంతనాలు, రాయబారం, ఒప్పందాలు, లెక్కలతోనే రేవంత్‌రెడ్డికి ముఖ్యమంత్రి పదవి దక్కిందని విమర్శలు ఉన్నాయి. అయితే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేది చంద్రబాబుకు జీవితకాలం జీర్ణంకాని అంశం కాబట్టి.. తన శిష్యుడిని తెలంగాణలో కుర్చీలో కూర్చోబెట్టి చక్రం తిప్పుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రేవంత్‌రెడ్డి మాటలు, అనుసరిస్తున్న విధానాలు కూడా ఇందుకు నిదర్శనాలుగా నిలుస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనపై కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావుపై బురదజల్లేందుకు చంద్రబాబు, రేవంత్‌రెడ్డి, ఎల్లో మీడియా పెద్దలు కుట్రలు పన్నారని స్పష్టమవుతున్నదని అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. ఇదంతటికీ కారణం.. బీఆర్ఎస్ పాలనలో నయవంచక చంద్రబాబుకు జరిగిన పరాభవమేనని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.
తెలంగాణను పట్టి పీడిస్తున్న పశుపతి!
తెలంగాణ ఏర్పడిన కొత్తలో.. హైదరాబాద్ నుంచే ఏపీ పాలన సాగించిన చంద్రబాబు.. ఏపీ అభివృద్ధిని ప్రాధాన్యతగా తీసుకోలేదని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. తెలంగాణలోనే ఉండి ప్రత్యేక రాష్ట్ర అస్తిత్వాన్ని దెబ్బతీయాలని చూసిన చంద్రబాబు… ఓటుకు నోటు రూపంలో కుట్రలు పన్నారని వివరిస్తున్నారు. ఆరు దశాబ్దాల ఆకాంక్ష, సబ్బండ వర్గాల పోరాటం, అమరుల త్యాగాల ఫలితంగా ఏర్పడిన ప్రత్యేక రాష్టాన్ని… తిరిగి తమ కబంధహస్తాల్లో పెట్టుకోవాలని చూసిన పచ్చముఠాకు ఆనాటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి అస్త్రంగా మారిన సంగతిని గుర్తుచేస్తున్నారు. కేసీఆర్ చెప్పినట్టుగా.. కత్తి ఆంధ్రావాడిదే అయినా.. పొడిచేవాడు మనవాడే అన్నట్టుగా.. రేవంత్‌రెడ్డి వ్యవహరించారని అంటున్నారు. కానీ ఓటుకు నోటు కుట్రను కేసీఆర్ సర్కారు భగ్నం చేసింది.
ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా పోలీసు అధికారులు రేవంత్‌రెడ్డిని డబ్బుల బ్యాగుతోపాటు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. తెలంగాణపై పెత్తనం చేయాలనుకున్న చంద్రబాబును ఈ కేసు… కరకట్టకు పారిపోయేలా చేసిందని రాజీకయ విశ్లేషకులు గుర్తుచేస్తున్నారు. కేసీఆర్ సర్కారు పోలీసు వ్యవస్థను పటిష్ఠం చేసింది. ఆనాడు నిఘా వర్గాల సమాచారం, ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఓటుకు నోటు దొంగలు దొరికారని, లేకపోతే తెలంగాణ అస్తిత్వమే దెబ్బతినేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. తమ కుట్రలు ఫలించలేదని, పాచికలు పారలేదని భంగపడ్డ చంద్రబాబు… తాత్కాలికంగా దాక్కున్న పచ్చముఠా… రేవంత్‌రెడ్డి పాలనలో.. అరుంధతి సినిమాలో పశుపతిలా తిరిగి తెలంగాణపై పడిందని రాజకీయ విశ్లేషకులు వ్యంగ్యాస్ర్తాలు సంధిస్తున్నారు. తెలంగాణ ఇంటి పార్టీ, తెలంగాణ ఆత్మ, తెలంగాణ స్వీయరాజకీయ అస్తిత్వమైన బీఆర్ఎస్పై, ఆ పార్టీ ముఖ్యులపై బురదచల్లడం.. అందులో భాగమని వివరిస్తున్నారు. మళ్లీ చంద్రబాబును రేవంత్‌రెడ్డి భుజాలపై ఎక్కించుకుని తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నారని, తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు.
‘ది హిందూ’ కథనంలో ఏముందంటే!
ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు గురించి సోషల్‌మీడియాలో జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో వాస్తవాలను ప్రజలకు చెప్పాలనే ఉద్దేశంతో ‘ది హిందూ’ పరిశోధనాత్మక కథనం రాసింది. టాలీవుడ్‌కు చెందిన సినీనటుల మొబైల్ ఫోన్లపై నిఘా పెట్టినట్టుగా దర్యాప్తులో ఎలాంటి ఆధారాలు లభించలేదని పోలీసు అధికారులు చెప్పినట్టు పేర్కొంది. బీఆర్ఎస్ పాలనలో వివిధ రంగాలకు చెందిన వ్యక్తుల ఫోన్లను ట్యాప్ చేశారనడానికి ఎలాంటి ఆధారాలు లేవని ఒక పోలీసు సీనియర్ అధికారి చెప్పారని ‘ది హిందూ’ పేర్కొంది.
ఫోన్ ట్యాప్ చేయడానికి తీసుకున్న నంబర్లలో సినిమా హీరోయిన్ల నంబర్లు లేవని పేర్కొంది. ‘4వేల సీడీఆర్లలో గానీ, 600 నంబర్లలో గానీ ఒకటి కూడా సినిమా హీరోయిన్ ఫోన్ నంబర్ లేదు’ అని ఓ పోలీసు ఉన్నతాధికారి స్పష్టంచేశారని తేల్చిచెప్పింది. ‘రాజకీయ నాయకులు, సినీ తారల ఫోన్లు ట్యాప్ చేశారన్న కథనాలు ఏ ఆధారాలతో వెలువడుతున్నయో తాము చెప్పలేమని సదరు పోలీసు అధికారి పేర్కొన్నారు.’ ఇదీ ‘ది హిందూ’ పరిశోధనాత్మక కథనం సారాంశం. అంటే ఏ ఆధారాలు కూడా లేకుండా ప్రచారం ఎవరి కనుసన్నల్లో జరిగింది..? ఎవరి ప్రణాళిక ప్రకారం జరిగింది..? ఎవరి ప్రయోజనాల కోసం జరిగింది..? పచ్చ మీడియా వెనుక ఏ శక్తులు ఉన్నాయి..? ఏ ‘బడాబాబు’లు ఉన్నారో విజ్ఞులైన తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోగలరని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు.
ట్యాపింగ్ ఎవరు చేస్తారు?
శాంతిభద్రతల పర్యవేక్షణ, నిఘా సమాచారం మేరకు ఇంటెలిజెన్స్ విభాగం అవసరమైతే కొందరి ఫోన్లను ట్యాపింగ్ చేస్తుందని పోలీస్‌శాఖలోని ఉన్నతాధికారులు చెప్తున్నారు. ఈ వివరాలతో ఇంటెలిజెన్స్ అధికారులు ప్రభుత్వ పెద్దలకు నివేదిక సమర్పిస్తారు. సమాచార సేకరణ ఎలా జరిగిందనే విషయంలో ప్రభుత్వ అధినేతల ప్రమేయం ఉండదని చెప్తున్నారు. అధికారంలో ఎవరు ఉన్నా.. ముఖ్యమంత్రికి ఇలాంటి నివేదికలను సమర్పించడం తమ విధుల్లో భాగమని కొందరు అధికారులు సైతం స్పష్టంచేస్తున్నారు. ఇప్పుడు రేవంత్‌రెడ్డికి కూడా ఇలాంటి నివేదికలే అందుతుంటాయని వివరిస్తున్నారు.
బీఆర్ఎస్ ప్రముఖులను వేధించడమే లక్ష్యంగా అధికార వర్గాల నుంచి అనుకూల మీడియాకు లీకులుదాన్ని చిలువలు పలువలుగా మార్చి వెబ్సైట్లు, యూట్యూబుల్లో కథనాలు, వ్యక్త్తిత్త హననమే లక్ష్యంగా అనుచిత థంబ్‌నెయిల్స్‌తో కథనాలు అల్లడం, బురద చల్లడం! ప్రధాన స్రవంతి మీడియా సైతం కథనాలు వండివార్చడం!
ఆ క్లిప్పింగులను సోషల్ మీడియాలో ఫేక్ ఖాతాలతో చెలామణిలో పెట్టడం! ట్రోల్ ఆర్మీని రంగం లోకి దింపడం! అదే నిజమన్నట్టు అధికార పార్టీ, బీజేపీ నేతలు వ్యాఖ్యలు చేయడం! ఇదో విషవలయం! ‘ది హిందూ’ తాజా కథనంతో ఈ కుట్రల చట్రం బద్ధలైనట్టే! కుతంత్రం పటాపంచలైనట్టే!