హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జూలై 9 (నమస్తే తెలంగాణ): డీఎస్సీ వాయిదా వేయాలని రెండురోజులపాటు నిద్రాహారాలు మాని అభ్యర్థులు చేపట్టిన ఆందోళన రెండోరోజైన మంగళవారం ఉగ్రరూపం దాల్చింది. డీఎస్ఈ ముట్టడి అనంతరం పోలీసులు సోమవారం రాత్రి పేట్లబురుజు సిటీ ఆర్మ్డ్ రిజర్వుడ్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో అభ్యర్థులను నిర్బంధించారు.
అదేరోజు సాయంత్రం డీఎస్సీ షెడ్యూల్‌ను ప్రభుత్వం విడుదల చేయడంతో భగ్గుమన్న వందలాది మంది నిరుద్యోగులు అక్కడి నుంచి ఉద్యమ కొనసాగింపును ప్రకటించారు. డీఎస్సీని వాయిదా వేసేవరకూ ఆందోళనను విరమించేది లేదంటూ భీష్మించుకు కూర్చున్నారు. ఈ సమయంలో పోలీస్ హెడ్‌క్వార్టర్స్ క్యాంటీన్లో రాత్రి పోలీసులు క్యాంటీన్‌ను మూయించి, లైట్లు బంద్ చేసి, నీళ్లు, తిండి లేకుండా దమననీతిని పాటించారు.
దీంతో పోలీసుల వేధింపులతో వందలాది మంది డీఎస్సీ అభ్యర్థులు.. కాలినడకన బయలుదేరి సుమారు 10 కిలోమీటర్ల దూరమున్న ఓయూ వరకు ర్యాలీగా వెళ్లారు. అక్కడే ఆర్ట్స్ కాలేజీ ఎదుట ఆందోళన చేపట్టారు. నిద్రాహారాలు మాని మంగళవారం కూడా నిరసనను కొనసాగించారు. ఇలాంటి పరిస్థితిలో పోలీసుల కర్కశత్వం కలచివేసింది. డీఎస్సీని మూడు నెలలు వాయిదా వేయాలని, మెగా డీఎస్సీ ప్రకటించాలనే న్యాయమైన డిమాండ్లు చేస్తున్న నిరుద్యోగ అభ్యర్థులపై భారీ పోలీసు బలగాలు విరుచుకుపడ్డాయి.
ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ ఆవరణలో పురుషులు, మహిళలు అని తేడా లేకుండా వెంటాడి తరుముతూ పట్టుకొని నిర్దాక్షిణ్యంగా ఎత్తుకెళ్లి పోలీస్ వాహనంలో ఎత్తిపడేశారు. మేం ఉగ్రవాదులం కాదు.. నిరుద్యోగులం అంటూ వేడుకున్నా ఆ పోలీసుల కఠినత్వం కరగలేదు. పదేండ్లపాటు పుస్తకాలతో కుస్తీ పడుతున్న విద్యార్థులు మాత్రమే కనిపించిన ఉస్మానియా యూనివర్సిటీలో మంగళవారం ఉదయం కనిపించిన ఈ దృశ్యాలు ప్రత్యేక తెలంగాణ ఉద్యమ ఘట్టాలను గుర్తు చేశాయి.
సోమవారం ఉదయం నుంచి మంగళవారం మధ్యాహ్నం వరకు డీఎస్సీ అభ్యర్థులు తిండీ తిప్పలు లేక, కనీసం తాగేందుకు మంచినీళ్లు కూడా దొరక్క తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా మహిళా నిరుద్యోగులు సైతం రోజంతా నిరసన చేయడంతోపాటు అర్ధరాత్రి పదుల కిలోమీటర్లు నడిచి, ఉస్మానియా యూనివర్సిటీకి చేరుకోవడం.. ఆపై మళ్లీ పోలీసులు అరెస్టు చేయడంతో యూనివర్సిటీలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది.
తెలంగాణ ఉద్యమం నాటి పరిస్థితులు
డీఎస్సీ అభ్యర్థులు రాత్రంతా క్యాంపస్‌లోనే తమ ఆందోళన కొనసాగించారు. మంగళవారం ఉదయం వందలాది మంది పోలీసులు క్యాంపస్‌లో మోహరించారు. ఓయూలోని ల్యాండ్ సేప్ గార్డెన్ వద్ద ఆందోళన చేస్తున్న విద్యార్థులను పోలీసులు అరెస్టు చేసేందుకు సిద్ధమయ్యారు. దీంతో అభ్యర్థులు వారిని తప్పించుకునేందుకు ప్రయత్నించగా, వారిని వెంటాడి మరీ పట్టుకొని అరెస్టు చేశారు.
ఈ క్రమంలో క్యాంపస్‌లోని అనేక ప్రాంతాల్లో పరుగులు పెడుతున్న నిరుద్యోగులు, వెంటాడుతున్న పోలీసులు.. ఇవే దృశ్యాలు కనిపించాయి. దీంతో తెలంగాణ ఉద్యమ సమయంలో ఆనాటి పాలకులు దమననీతి కండ్లముందు కదలాడిందని విద్యార్థులు, నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. మీడియా ప్రతినిధులు కూడా ఇదే విషయాన్ని గుర్తు చేశారు.
డీఎస్సీ పరీక్షలను వాయిదా వేయాల్సిందేనని, ప్రభుత్వం తన మొండివైఖరిని విడనాడాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు డిమాండ్ చేశారు. డిఎస్సీ పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఓయూ ఆర్ట్స్ కళాశాల ఎదుట బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్బంగా సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం తుంగ బాలు మాట్లాడారు. తెలంగాణలో డీఎస్సీని వాయిదా వేయాలని రెండునెలలుగా నిరుద్యోగులు కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. వెంటవెంటనే పరీక్షలు ఉండటంతో డీఎస్సీ అభ్యర్థులు మానసిక ఒత్తిడికి లోనవుతున్నారని తెలిపారు.