చెన్నై: ఎన్ఫోర్స్మెంట్ అధికారులపై శనివారం చెన్నైలో పోలీసు కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, తమిళనాడు శాసన సభ సచివాలయం అధికారి ఒకరు చేసిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. అనుమతి లేకుండా ఎమ్మెల్యేల హాస్టల్లోని ఎమ్మెల్యే సెంథిల్ కుమార్ గదిలోకి గుర్తు తెలియని వ్యక్తులు తాము ఈడీ అధికారులమని చెప్పుకుని, చొరబడ్డారని ఈ ఫిర్యాదులో ఆరోపించినట్లు తెలుస్తున్నది. విశ్వసనీయ సమాచారం ప్రకారం, ఈడీ అధికారులు శనివారం రాష్ట్ర మంత్రి, డీఎంకే నేత ఐ పెరియసామి, ఆయన కుమారుడు ఐ సెంథిల్ కుమార్లకు చెందిన ఆస్తులపై పలు చోట్ల సోదాలు నిర్వహించారు. మనీ లాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా ఈ తనిఖీలు జరిగాయి.