కోరుట్ల, ఫిబ్రవరి 7: మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రసంగిస్తున్నారంటూ పోలీసులు శవయాత్ర ముందుకుసాగకుండా అడ్డుకున్నారు. మండుటెండలో అరగంట పాటు శవంతో బం ధువులు రోడ్డుపై నిరీక్షించడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ ఘటన జగిత్యాల జిల్లా కోరుట్లలో శనివారం జరిగింది. మంత్రి ఉత్తమ్ కోరుట్లలోని పలు వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. స్థానిక కాల్వగుడ్డ కూరగాయల మారెట్ సమీపంలో ప్రచార రథం పైనుంచి మంత్రి ప్రసంగిస్తుండగా అదే సమయంలో స్థానిక రజకవాడలో కుమ్మనపల్లి శశికళ (45) శుక్రవారం మృతి చెందగా, శనివారం శవయాత్ర నిర్వహిస్తున్నారు.
అక్కడే బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులు శవయాత్రను అడ్డుకున్నారు. శవాన్ని తరలించేందుకు దారి ఇవ్వాలని వారు పోలీసులతోపాటు స్థానిక నాయకులను కోరినా స్పందించలేదు. మండుటెండలో మంత్రి ప్రసంగం ముగిసే వరకు అరగంటపాటు శవంతో రహదారిపై కుటుంబ సభ్యులు, బంధువులు నిరీక్షించారు. మంత్రి ప్రసంగం తర్వాత స్థానిక నాయకులు స్పీచ్ ఇవ్వడంతో సహనం కోల్పోయిన బంధువులు నిరసనకు దిగారు. మీడియా ప్రతినిధులు అకడికి చేరుకోవడంతో పోలీసులు ఉన్నతాధికారులకు విషయాన్ని చేరవేశారు. వెంటనే అధికారులు మంత్రి దృష్టికి తీసుకెళ్లడంతో కాసేపు ప్రసంగాన్ని నిలిపివేసి, శవయాత్రకు అనుమతించారు. శవయాత్రను అడ్డుకోవడంతో బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తంచేశారు. ప్రజల కోసం పనిచేస్తున్నామని చెప్పే నాయకులు శవయాత్రను అడ్డుకోవడం ఏమిటని స్థానికులు పలువురు ప్రశ్నించారు.